MLC Polls 2021 Results: తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, రెండు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థుల ఆధిక్యం, పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న
నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి గానూ 16,130 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. ఈయనకు సమీపంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న 12,046 ఓట్లతో....
Hyderabad, March 18: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు బుధవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, గురువారం కొనసాగుతుంది. ఈరోజు అర్ధరాత్రి వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ స్థానానికి 71 మంది పోటీ చేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగటం, అభ్యర్థికి సంబంధించి మొదటి మరియు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన క్రమంలో ఫలితాలు వెల్లడికావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
కాగా, కొద్దిసేపటి క్రితమే తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి గానూ 16,130 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. ఈయనకు సమీపంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న 12,046 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక 9,080 ఓట్లతో ప్రొ. కోదండ రామ్ మూడో స్థానంలో నిలవగా, ఆ తరువాతి స్థానానికి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నిలిచారు. స్వతంత్ర అభ్యర్థుల కంటే జాతీయ పార్ఠీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులు వెనకబడటం ఇక్కడ గమనార్హం.
ఇక రెండో రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఆయనకు స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇద్దరికి మధ్య ఓట్ల వ్యత్యాసం ప్రస్తుతం 3 వేల పైగా ఉంది, అయితే మొత్తం 7 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగనుంది.
మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్ ఫలితాలలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణికి 17,439 ఓట్లు రాగా, 16,385 ఓట్లతో బిజేపీ అభర్థి రామచంద్రా రావు రెండో స్థానంలో ఉన్నారు. 8,357 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్ రావు మూడోస్థానంలో, 5,082 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు.