White Paper: 'శ్వేత పత్రం విడుదల చేసిన ప్రభుత్వం' అసలు రాజకీయ పరిభాషలో ఈ శ్వేతపత్రం అంటే అర్థం ఏమిటి?
ప్రభుత్వం మీద ప్రతిపక్షం ఏదైనా ఆరోపణలు చేసినపుడు లేదా తమ పాలన ఎంత పారదర్శకంగా ఉందో చెప్తూ రాజకీయ నాయకులు తరచుగా శ్వేత పత్రాలు విడుదల చేయడం మనం చూస్తుంటాం...
ప్రభుత్వం మీద ప్రతిపక్షం ఏదైనా ఆరోపణలు చేసినపుడు లేదా తమ పాలన ఎంత పారదర్శకంగా ఉందో చెప్తూ రాజకీయ నాయకులు తరచుగా శ్వేత పత్రాలు విడుదల చేయడం మనం చూస్తుంటాం. అసలు ఈ శ్వేత పత్రం అంటే ఏమిటి? ఈ శ్వేతపత్రాల వలన జనాలకు కలిగే ఉపయోగమేమిటి?
నిజానికి ఈ శ్వేత పత్రం అనేది బ్రిటీష్ కాలం నుంచి ఉంది. 1920వ దశకంలో ఆ నాటి బ్రిటీష్ పాలకులు తమ విధానాలకనుగుణంగా 'గ్రీన్ పేపర్' (Green Paper), 'వైట్ పేపర్' (White Paper) అంటూ ఆయా విషయాలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి సరైన అవగాహన కొరకు వివిధ రంగుల పేపర్లను వాడే వారు. ఇందులో 'వైట్ పేపర్' ఇప్పటివరకు ఏం జరిగింది, ఎలా చేశాము, ఇకపై ఎలా ముందుకు వెళ్తున్నాము అని వివరిస్తుంది.
ఇదే పద్ధతి ఈనాటికి అమలవుతుంది. ఉదాహరణకు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేశారనుకోండి. అందులో ఒక ఏడాదికి సంబంధించిన రాష్ట్ర ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చుల్లో ఎంత పోతుంది, ఇప్పటివరకు ఏయే పాలసీలకు ఎన్ని కేటాయింపులు జరిగాయి, రాష్ట్రం మీద ఎన్ని అప్పులు ఉన్నాయి, నికరంగా మిగిలేది ఎంత అనే విషయాలు లెక్కలతో సహా చూపిస్తారు అన్నమాట.
ఈ శ్వేతపత్రం అనేది ఒక ప్రామిసరీ నోట్ లాంటింది, సింపుల్ గా చెప్పాలంటే ఉద్యోగార్థులు తమ రెస్యూమె చివరన ఐ హియర్ బై డిక్లేరింగ్ అంటూ.. రాస్తారు అలాంటిందే. ఈ పత్రంలో కూడా పేర్కొన్న ప్రతీది అక్షర సత్యం అని, అందుకు ప్రభుత్వం తరఫున లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం అన్నమాట. ఇందులో ఎలాంటి అవాస్తవాలకు, దాచిపెట్టడాలకు చోటు లేదు అలా ఏవైనా ఉంటే తామే బాధ్యులము అని పేర్కొనడం.
శ్వేతపత్రంలో ఒక ప్రభుత్వం తమ పాలసీలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి విధానాలు అనుసరించింది, అందులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించాము, ఇకముందు ఎలా ముందుకెళ్లబోతున్నామో తెలుపుతూ. దీనిపై ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వదలచుకుంటే ఈ సమాజంలోని ప్రతివ్యక్తి, ప్రతి సంఘం, ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావొచ్చు. తాము అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని వాటి అమలుపై పరిశీలిస్తామని చివరలో లిఖిత పూర్వకంగా పేర్కొంటారు.
ఈ శ్వేతపత్రాలు ఏదైనా విషయం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఉద్దేశింబడినవి. ఒక పాలసీ యొక్క పూర్వపరాలు, ఇక మీదట అనుసరించబోయే విధానాలు అన్ని సవివరంగా సమాజానికి శ్వేతపత్రం ద్వారా తెలియజెప్పటం.
ఒక నాయకుడు మాటల్లో ఏదైతే చెబుతున్నారో, అదే అధికారికంగా శ్వేతపత్రంలో లిఖిత పూర్వకంగా పేర్కొంటారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఈ శ్వేతపత్రాల్లోని వాస్తవాలు, అందులోని నిబద్ధత, విశ్వసనీయత ఎంత అనేది మీ ఆలోచనలకే వదిలేస్తున్నాం.