
Vjy, Mar 3: వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)పై నరసారావుపేటలో మరో కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో రాజంపేట జైలు అధికారులు ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. ఈ ఉదయాన్నే పీటీ వారెంట్(PT Warrant)తో నరసరావుపేట టూటౌన్ పోలీసులు రాజంపేట సబ్‌జైలుకు చేరుకున్నారు. పోసాని మీద బీఎన్‌ఎస్ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు చేశారు. అయితే అభియోగాలు ఏంటన్న దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
నరసరావుపేటకు పోసానిని (Posani Krishna Murali) తరలించే ముందు రాజంపేట సబ్ జైలుకు నరసరావుపేటతో పాటు అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు ఒకేసారి జైలు వద్దకు చేరుకున్నారు. పోసానిపై నమోదైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు జైలు అధికారులకు సమర్పించారు.మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. ముందుగా మాకే పోసానిని అప్పగించాలి..’ అని కోరారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం నరసరావుపేట పోలీసులకు అనుమతి ఇచ్చారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ పోసాని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు.
నేడు కడప కోర్టు(Kadapa Court)లో పోసాని కృష్ణ మురళీ తరఫున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇంకోవైపు పోసానిని కలిసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ములాఖత్ పెట్టున్నారు. అయితే ఈ లోపే ఆయన్ని నరసరావుపేట తరలించడం గమనార్హం.ఇక పోసాని భార్యను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.