
Kadapa, FEB 27: సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) విచారణ పూర్తయింది. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఆయన్ను విచారించారు. 8 గంటల పాటూ పోసానిని విచారించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్. అయితే, పోలీసుల విచారణకు పోసాని సహకరించ లేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేదని సమాచారం. తెలీదు, గుర్తు లేదు అని పోసాని చెబుతున్నారట. అటు పోసాని తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
Posani Arrested: నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో నటుడు పోసానిపై (Posani Krishna Murali) జనసేన నేత మణి ఈ నెల 24న ఫిర్యాదు చేశారు. సినీ పరిశ్రమపై పోసాని తీవ్ర విమర్శలు చేశారని.. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జోగినేని మణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిన్న అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్ లో పోసానిని అరెస్ట్ చేశారు.
కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై ఆభియోగాలు నమోదయ్యాయి. ఏపీ వ్యాప్తంగా పోసానిపై పదికి పైగా కేసులు నమోదయ్యాయి. పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. నిన్న పోసానిని అదుపులోకి తీసుకున్న అన్నమయ్య జిల్లా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.