Narasimhan Farewell: రాజ్ భవన్ విడిచి వెళ్తూ భావోద్వేగానికి గురైన నరసింహన్. మాజీ గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన తెలంగాణ ప్రభుత్వం. ఇన్నేళ్ల జ్ఞాపకాలు నెమరేసుకున్న సీఎం కేసీఆర్.
గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మొదట సమైక్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్ గా, చివరికి తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ మూడు రకాల బాధ్యతలు నిర్వర్తించారు. నేను ఉద్యమ కారుడిగా, ముఖ్యమంత్రిగా రెండు రకాల బాధ్యతలు నిర్వర్తించాను. ఈ కాలంలో ఇద్దరి మధ్య అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయి...
Hyderabad, September 07: తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళ్ఇసై సౌందరరాజన్ సెప్టెంబర్ 08న పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇక ఇంతకాలం గవర్నరుగా సేవలందించిన నరసింహన్ (Narasimhan) ఈరోజు (సెప్టెంబర్ 7) తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. అంతకుముందు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సభలో సీఎం కేసీఆర్ (K. Chandrashekhar Rao)మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలుగా నరసింహన్ తో తనకు ఏర్పడిన అనుబంధాన్ని, గవర్నర్ గా ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన గవర్నర్ నరసింహన్ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని కేసీఆర్ అన్నారు.. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపిన గవర్నర్ నరసింహన్ తో తనకు అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయని సీఎం తెలిపారు. రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులు ప్రతీ పండుగను గొప్ప వేడుకగా నిర్వహించేవారని, ఇప్పుడా ఆత్మీయతకు దూరం అవుతున్నామని చెప్పారు. నరసింహన్ ఇచ్చిన స్పూర్తిని, మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకెళతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తన ప్రసంగం మధ్యలో చాలా సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు.
CM KCR & Former Governor Narasmihan During send off at Begumpet Airport:
‘‘గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మొదట సమైక్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్ గా, చివరికి తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ మూడు రకాల బాధ్యతలు నిర్వర్తించారు. నేను ఉద్యమ కారుడిగా, ముఖ్యమంత్రిగా రెండు రకాల బాధ్యతలు నిర్వర్తించాను. ఈ కాలంలో ఇద్దరి మధ్య అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మాజీ ఐపీఎస్ అధికారి అయిన నరసింహన్ గవర్నర్ గా వచ్చారు. ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారనే భయం నాడు కొందరిలో ఉండేది. అదే సమయంలో నేనే ఆయన్ను కలిశాను. ఉద్యమ నేపథ్యాన్ని, ఇన్నేళ్లుగా ఉద్యమం సజీవంగా ఉండడానికి గల కారణాలను ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాధిపతిగా పనిచేసిన అనుభవం కలిగిన గవర్నర్ తెలంగాణ ఉద్యమం గురించి, ఇక్కడి ప్రజల డిమాండ్ గురించి కేంద్రానికి సరైన నివేదికలు పంపి న్యాయం చేస్తారనే నమ్మకం నాకున్నదని నేను తొలినాళ్లలోనే ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశాను’’ అని సీఎం గుర్తు చేసుకున్నారు.
‘‘నరసింహన్ గవర్నర్ గా ఉన్న సమయంలోనే తెలంగాణ వచ్చింది. ఆయన హయాంలోనే తాము రెండు సార్లు అధికారంలోకి వచ్చాం. ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. నేను తననో పెద్ద మనిషిలాగానే చూశాను. నన్ను కూడా ఆయన సీఎంలా కాకుండా, తమ్ముడిలా ఆదరించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల మంచి, చెడులను ఎప్పటికప్పుడు చర్చించేవారు. పథకాల ఉద్దేశ్యాలను తెలుసుకునే వారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వాకబు చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం చేసే మంచి పనులకు కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గవర్నర్ వివరించేవారు. దానివల్ల మనకు మంచి ప్రశంసలు లభించేవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించడానికి చొరవ చూపారు’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
‘‘యాదాద్రి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినప్పుడు గవర్నర్ దంపతులు ఎంతో నిష్టతో మడికట్టుకుని అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను తల్లిదండ్రులను కోల్పోయాను. పెద్దన్న లేడు. పెద్దల ఆశీర్వాదం తీసుకుని మంచి పనికి శ్రీకారం చుట్టాలని భావించాను. నాకు గవర్నర్ దంపతులే పెద్దదిక్కుగా కనిపించారు. సోదరభావంతో వారికి పాదాభివందనం చేసి పని ప్రారంభించాను. అది విజయవంతగా కొనసాగుతున్నది. నరసింహన్ గారు యాదాద్రి పనులు పూర్తయ్యాక మళ్లీ రావాలి. పూజలో పాల్గొనాలి. గవర్నర్ నరసింహన్ చూపిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుర్తుండిపోతాయి’’ అని కేసీఆర్ భావోద్వేగంతో మాట్లాడారు.
‘‘నరసింహన్ కు ఇచ్చినట్లే వచ్చే గవర్నర్ కు కూడా అదే గౌరవం ఇస్తాం. రాజ్ భవన్ ప్రాశస్త్యాన్ని కాపాడుతాం’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
వెళ్లొస్తాం అంటూ...!
ఇక ప్రగతిభవన్ లో వీడ్కోలు కార్యక్రమం ముగిసిన తర్వాత నరసింహన్ ఆయన సతీమణి రాజ్ భవన్ చేరుకుని అనంతరం అక్కడ్నించి బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారి కోసం ప్రభుత్వం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.
బేగంపేట విమానాశ్రయంలో కూడా నరసింహన్‌కు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎయిర్‌పోర్టులో నరసింహన్ పోలీసుల నుంచి వీడ్కోలు గౌరవవందనం స్వీకరించారు. విమానంలోకి వెళ్లేటపుడు నరసింహన్ మరియు ఆయన సతీమణి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారి కళ్లలో నీళ్లు తిరిగాయి. మరోసారి అందరికీ మాజీ గవర్నర్ దంపతులిద్దరూ వీడ్కోలు నమస్కారం చేస్తూ బెంగళూరు బయలుదేరి వెళ్లారు. కొన్నిరోజుల క్రితమే ఇకపై తాను సాధారణ జీవితం గడుపుతాను అని వెల్లడించిన విషయం తెలిసిందే.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)