'Ranneeti not Rajneeti' : దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజనీతి కాదు, రణనీతి కావాలి. దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదు; ప్రధానితో అఖిలపక్షం భేటీలో టీఎస్ సీఎం కేసీఆర్

కరోనా వైరస్ కు చైనాయే కారణమనే అపఖ్యాతి వచ్చింది. ఆ దేశం నుంచి చాలా బహుళ జాతి సంస్థలు బయటకు వస్తున్నాయి. అవి భారతదేశంవైపు చూస్తున్నాయి. పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమైనదని ప్రపంచ వ్యాప్తంగా భావిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు రిపోర్టు ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 142 వ స్థానం నుంచి 63వ స్థానానికి భారతదేశం ఎదిగింది...

All Party Meeting | File Photo

Hyderabad, June 20: భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. భారతదేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలుదువ్వుతున్నదని సీఎం అభిప్రాయపడ్డారు. గాల్వన్ లోయలో వీర మరణం పొందిన సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అందించే సాయాన్ని కూడా సీఎం ప్రకటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు పాల్గొన్న ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ తన అభిప్రాయాలు చెప్పారు.

‘‘చైనా, పాకిస్తాన్ దేశాలకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇప్పుడు చైనాలో కూడా అంతర్గత సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతున్నది. చైనా వైఖరి ప్రపంచ వ్యాప్తంగా బాగా అపఖ్యాతి(బద్నాం) పాలయింది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘‘భారతదేశంతో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నది. గాల్వన్ లోయ లాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. 1957లో సరిహద్దు వివాదం లేవనెత్తింది. 1962లో ఏకంగా భారత్ – చైనా మధ్య పూర్తిస్థాయి యుద్ధమే జరిగింది. 1967లో కూడా సరిహద్దులో ఘర్షణ జరిగింది. అప్పుడు 200 మంది మృతి చెందారు. ఇప్పుడు గాల్వన్ వద్ద మళ్లీ ఘర్షణలు జరిగాయి. అందులోనూ మన సైనికులు 20 మంది మరణించారు. వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన దేశంతో ఎక్కడో ఓ చోట ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉంది. చైనాతో భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మనం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

‘‘చైనా ఇటీవల కాలంలో భారతదేశంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తున్నది. దానికి ప్రత్యేక కారణాలున్నాయి. కాశ్మీర్ విషయంలో కొత్త చట్టాలు తెచ్చాం. అక్కడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. పివోకె గురించి గట్టిగా మాట్లాడుతున్నాం. ఆక్సాయ్ చిన్ మనదే అని, అది చైనా ఆక్రమించిందని పార్లమెంటులోనే మన కేంద్ర మంత్రి ప్రకటించారు. గాల్వన్ లోయ దేశ రక్షణ విషయంలో స్ట్రాటజిక్ పాయింట్. అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఇది చైనాకు నచ్చడం లేదు. అందుకే ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తున్నది’’ అని సీఎం చెప్పారు.

‘‘మనది శాంతికాముక దేశం. అదే సమయంలో సహనానికి హద్దు ఉంటుంది. ఎవరైనా మన మీదకి వస్తే తీవ్రంగా ప్రతిఘటించాలి. దేశ రక్షణ, ప్రయోజనాల విషయంలో రాజీ పడవద్దు. ఈ పరిస్థితుల్లో రాజకీయం అవసరం లేదు. రణనీతి కావాలి. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయం ఇది. గతంలో కూడా ఇతర దేశాలతో ఘర్షణలు, యుద్ధాలు జరిగినప్పుడు ఇలాగే నిలబడిన సందర్భాలున్నాయి. చైనా యుద్ధం, పాక్ యుద్దాలు, బంగ్లాదేశ్ యుద్దాలు చేసిన అనుభవం మనకున్నది. 1970 ప్రాంతంలో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో ఇందిరాగాంధిని వాజ్ పేయి దుర్గామాత అని కొనియాడారు. అలాంటి స్ఫూర్తి ఇప్పుడు కావాలి. దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అండగా నిలవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఈ సమయంలో దేశ ప్రధానికి అండగా ఉంటారు’’ అని సీఎం స్పష్టం చేశారు.

‘‘ఆత్మ నిర్భర్ భారత్ (స్వయం సమృద్ధ భారతదేశం) కావాలని మనం కోరుకుంటున్నాం. కానీ చైనా మాత్రం అన్య నిర్భర్ భారత్ (ఇతరులపై ఆధారపడే భారతదేశం) కావాలని ఆకాంక్షిస్తున్నది. మన దేశం ఎదగడం చైనాకు ఇష్టం లేదు. ఆర్థికంగా ప్రబల శక్తిగా భారత్ మారుతున్నది. అమెరికా 21 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక శక్తి అయితే, చైనా 14 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉంది. 5 ట్రిలియన్ డాలర్ల సంపద కలిగిన జపాన్ తో పాటుగా భారత్ కూడా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేయడం చైనా భరించలేక పోతున్నది. భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వం, స్థిరంగా ఆర్థికాభివృద్ధి జరగడాన్ని ఆ దేశం ఓర్వలేకపోతున్నది, అందుకే ఈ గొడవలు సృష్టిస్తున్నది’’ అని కేసీఆర్ అన్నారు.

‘‘కరోనా వైరస్ కు చైనాయే కారణమనే అపఖ్యాతి వచ్చింది. ఆ దేశం నుంచి చాలా బహుళ జాతి సంస్థలు బయటకు వస్తున్నాయి. అవి భారతదేశంవైపు చూస్తున్నాయి. పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమైనదని ప్రపంచ వ్యాప్తంగా భావిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు రిపోర్టు ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 142 వ స్థానం నుంచి 63వ స్థానానికి భారతదేశం ఎదిగింది. భారతదేశంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు బాగా అమలు అవుతున్నాయి. భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా బాగా పెరుగుతున్నాయి. 2014 నుంచి 2017 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 36 బిలియన్ డాలర్ల నుంచి 61 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇంకా పెరగడానికి అవకాశాలున్నాయి. చైనా నుంచి తీసుకొచ్చి, తెలంగాణలో తమ కంపెనీలు పెట్టడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఇది చైనాకు నచ్చడం లేదు" అని పేర్కొన్నారు.

‘‘చైనా నుంచి వస్తువుల దిగుబడి ఆపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది తొందరపాటు చర్య అవుతుంది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాలి. ప్రజలకు సరసమైన ధరల్లో వస్తువులు దొరకాలి. ముందుగా మనం ఈ విషయాలపై దృష్టి పెట్టాలి’’ అని టీఎస్ సీఎం కేసీఆర్ సూచించారు.

‘‘భారత్ తో చైనా ఘర్షణాత్మక వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు వద్దు. అదే సమయంలో ఎవరికీ తలవంచొద్దు. రక్షణ వ్యవహారాలలో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి. బ్రిటన్ ప్రతిపాదించిన డి 10 గ్రూపులో కలవాలి. ఓరాన్ అలయెన్సులో చేరాలి. హువాయ్ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టాలి. మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి’’ అని కేసీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now