Sammakka Saralamma Jathara - 2020: తెలంగాణ కుంభమేళాకు సర్వం సిద్ధం, జనసంద్రంగా మారిన మేడారం, రేపటి నుంచే జాతర ప్రారంభం, ఇప్పటికే చేరుకున్న 40 లక్షల భక్తజనం
సుమారు 40 లక్షల మంది ఇప్పటికే మేడారం చేరుకున్నట్లు అంచనా. ఫిబ్రవరి 08న జాతర ముగిసే వరకు దాదాపు కోటి మంది భక్తులు తరలి వచ్చి సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకోనున్నారు.నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.
Mulugu, February 04: తెలంగాణ మహాకుంభమేళాగా (Telangana Kumbh Mela) ప్రసిద్ధి చెందిన సమక్క సారలమ్మ జాతరకు (Sammakka Saralamma Jathara - 2020) సర్వం సిద్ధమైంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద 'గిరిజన' జాతర ఫిబ్రవరి 05 నుంచి ప్రారంభమవుతుంది. దేశంలోని గిరిజనులే కాకుండా, ఆసియా ఖండంలోని గిరిజన జాతుల ప్రజలు, గిరిజన తెగలు ఇక్కడకు తప్పకుండా చేరుకుని వారి ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించడం అనవాయితీ. కేవలం గిరిజనులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు.
రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర కన్నులపండుగగా జరుగుతుంది. ఇందుకోసం మేడారం (Medaram) ముస్తాబైంది. మేడారం వైపు అన్ని దారులు కిక్కిరిసి పోయాయి. ఎటూ చూసినా లక్షల మంది జనాలు, వేల సంఖ్యల గుడారాలతో మేడారం అడవి ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. సుమారు 40 లక్షల మంది ఇప్పటికే మేడారం చేరుకున్నట్లు అంచనా. ఫిబ్రవరి 08న జాతర ముగిసే వరకు దాదాపు కోటి మంది భక్తులు తరలి వచ్చి సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకోనున్నారు.
నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.
మొదటి రోజు - (5-02-2020): మేడారం జాతర యొక్క మొదటి రోజు సారలమ్మ, పడిగిద్ద రాజులు మేడారం గద్దెకు చేరుకున్న సందర్భంగా ఉత్సవం నిర్వహిస్తారు. గిరిజన పూజారులు సారలమ్మకు రహస్యంగా, ప్రత్యేక ఆచారాలతో పూజలు నిర్వహిస్తారు. వివాహం కానివారు వివాహం కోసం, పిల్లలు పుట్టని వారు పిలల్ల కోసం, ఇతర బాధలు, వ్యాధులు ఉన్నవారు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
రెండవ రోజు (06-02-2020): మేడారం జాతర యొక్క రెండవ రోజున సమ్మక్క మేడారం గద్దెకు చేరుకుంటుంది. ఆమె రాక ‘ఎదురుకోళ్ల' ఘట్టం జరగడం ప్రత్యేకత. ప్రభుత్వం అధికార లాంఛనాల మధ్య సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క చిలుకల గుట్టకు చేరుకోగానే ఆమె రాకకు సూచనగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరుపగా, ఉన్నతాధికారులు ఆ దేవతామూర్తికి సాదరంగా ఆహ్వనం పలుకుతారు. జయజయధ్వనాల మధ్య సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు.
మూడవ రోజు (07-02-2020): ఇక జాతర యొక్క 3వ రోజు, సమ్మక్క సారలమ్మలు భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంటారు. ఈరోజు జాతరలో అతి ముఖ్యమైన రోజు, ఇదే రోజు భక్తులు మొక్కులు చెల్లించుకోవాలి. కాబట్టి ఈరోజు భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. భక్తులు ‘జంపన్న వాగు’ లో పుణ్య స్నానాలు చేసిన తరువాత దేవతలను దర్శనం చేసుకొని, బోనాలు సమర్పిస్తారు. ఒడి బియం, సారేకూడా సమర్పిస్తారు.
అంతేకాకుండా సమ్మక్క సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన సమర్పణ ‘బంగారం’. భక్తులు తమ బరువుకు సరితూగే 'కొత్త బెల్లం'ను దేవతలకు బంగారంగా సమర్పిస్తారు.
నాలుగవ రోజు (08-02-2020): మేడారం జాతరలో ఇదే చివరి రోజు. ఈరోజు సమ్మక్క సారలమ్మల వనప్రవేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. వారిని గద్దెపైకి ఆహ్వానించేటపుడు ఏ రకమైన గౌరవం లభిస్తుందో, తిరిగి వెళ్లేటపుడు కూడా అలాంటి అధికార లాంఛనాలు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులచే ఆరాధించబడిన తరువాత, ఆ వన దేవతలు తిరిగి అడవిలోకి అంతర్ధానం అవుతారు. ఇది మేడారం జాతర ముగింపును సూచిస్తుంది.