Ganesh Chaturthi 2020: వినాయక చవితి..ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ప్రత్యేకతలేంటీ? శివుడు వినాయకునికి చెప్పిన మంత్రం ఏమిటి? వినాయక మహత్యం గురించి ఆసక్తిర కథనం మీకోసం

వినాయక చవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా (Ganesh Chaturthi 2020) జరుపుకుంటారు. ఈ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.. కైలాసములో పార్వతీ దేవి శివుని (Lord Shiva) రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని (Ganesha) రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు.

Happy Ganesh Chaturthi 2020 (File Image)

వినాయక చవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా (Ganesh Chaturthi 2020) జరుపుకుంటారు. ఈ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.. కైలాసములో పార్వతీ దేవి శివుని (Lord Shiva) రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని (Ganesha) రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు.అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది.

శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. అతని వాహనము అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు.కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు. అతని వాహనము నెమలి. అతను మహా బలశాలి. పితృ దినోత్సవం ఎప్పుడు మొదలైంది

ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'మాకు ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని' కోరారు. ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, 'మీలో ఎవరైతే ముల్లోకముల లోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు' అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతు విధించటం సబబేనా ? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఎదైనా తరుణోపాయం చెప్ప'మని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు.

'సకృన్‌ నారాయణే త్యుక్త్వా పుమాన్‌ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'

కుమారా! ఇది నారాయణ మంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవగలనో లేదో, కుమార స్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను ? అని సందేహించకుండా, ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడు మార్లు తల్లి దండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసములోనే ఉండి పోయాడు. అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. మాతృ వందన దినోత్సవం (Happy Mother's Day) 

అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యము ఇవ్వండీ అన్నాడు.'

ఆ విధంగా బాధ్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాల లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకములైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకము, వడ పప్పు సమర్పించారు.

విఘ్నేశ్వరుడు, తృప్తి పడి తిన్నంత తిని, తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరు కున్నాడు. ఎప్పటిలాగా తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులసలు నేల కానితేనా ? పొట్ట వంగితేనా ? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక పకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీదొర్లు కుంటూ బయటకు వచ్చేసాయి. పార్వతీ దేవి దుఃఖించుచూ, చంద్రుని ఇలా శపించింది. 'ఓరి పాపాత్ముడా! నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు.'

ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదిక్షణాలు చేస్తున్నారు. అగ్ని దేవుడు ఆ ఋషి పత్నులను చూసి మోహించాడు. కాని ఋషుల శాపాలకు భయ పడ్డాడు. అతని కోరిక గ్రహించిన అగ్ని దేవుని భార్య, ఒక్క అరుంధతీ రూపము తప్ప మిగతా అందరి రూపమూ ధరించి అతనికి ప్రియం చేసింది. ఋషులది చూసి తమ భార్యలేనని తలచి వాళ్లను వదిలి వే్సారు. దీనికి కారణము, వారు చంద్రుని చూడటమే! దేవతలు, మునులు వెళ్లి శ్రీ మహా విష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, అసలు విషయం తెలుసు కుని ఋషులకు వివరించి, వాళ్ల కోపం పోగొట్టాడు.

కైలాసమునకు వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలగు వారంతా 'ఓ పార్వతీ! నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు. నీ శాపాన్ని ఉపసంహరించు' అన్నారు. పార్వతి కూడా తన కుమారుని ముద్దాడి, 'ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడ రాదు' అని శాపోపశమనమును కలుగ చేసింది. ఆ రోజు బాధ్రపద శుద్ధ చతుర్థి. ఆ రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇలా కొన్నాళ్లు జరిగింది.

ద్వాపర యుగములో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురూ ఈ కబురూ చెప్పి చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు. "ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి" అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుడ్ని చూడవద్దని చాటింపు వేసాడు. అతనికి పాలంటే ప్రీతి కదా! తనే స్వయంగా పాలుపితుకుదామని, అకాశం కేసి చూడకుండా ఆవు దగ్గర కెళ్ళి పాలు పితుకుతూంటే పాలలో చంద్రబింబం కనిపించింది. 'హతవిధీ! నేనేమీ నీలాప నిందలు పడాలో కదా!' అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకి వచ్చాడు. అతని దగ్గర శమంతక మణి ఉంది. అది సూర్యవరము వల్ల పొందాడు. శ్రీ కృష్ణుడది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. 'అది రోజుకు ఎనిమిది బారువులు బంగారము నిస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు ' అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు.

ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమనుకుని అతనిని చంపి మణిని తీసుకుని పోతూండగా జాంబవంతుడనే ఒక భల్లూకము సింహమును చంపి మణిని తన గుహకు తీసుకుని పోయి తన కూతురికి ఆట వస్తువుగా యిచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు 'ఇంకేముంది మణి నివ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముడ్ని చంపి మణి తీసుకున్నాడని ' చాటింపు వేసాడు.

శ్రీ కృష్ణుడు 'తను భయపడినట్టుగా నీలాపనిందలు రానేవచ్చాయి. దానినెలాగైనా రూపుమాపాలి ' అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహవైపుకి భల్లూకం అడుగు జాడలు కనిపించాయి. ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తూంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది.

అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య యిరువయ్యెనిమిది రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామ చంద్రుడే అని గ్రహించాడు.వెంటనే చేతులు జోడించి 'దేవాదిదేవా! ఆర్తజనరక్ష!నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామ చంద్రునిగా గుర్తించాను.

ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుందన్నావు. అప్పటినుంచీ నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నాయింటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడిని స్వామీ! నాలో శక్తి క్షీణిస్తోంది. జీవితేచ్చ నశిస్తోంది నా అపచారము మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప నితః పరంబెరుగను ' అని పరిపరి విధాల ప్రార్థించాడు.

శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి 'జంబవంతా! శమంతక మణిని అపహరించానన్న నింద వచ్చింది. దాన్ని రూపుమాపడానికి వచ్చాను. నువ్వు అ మణినిస్తే నేనువెళ్ళివస్తాను ' అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని, తన కూతురు జాంబవతినీ కూడా కానుకగా ఇచ్చాడు. తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో, శమంతకమణితో, జాంబవతితో సత్రాజిత్తు దగ్గరకెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేని పోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాపపరిహారంగా తన కుమార్తె అయిన సత్యభామని భార్యగా స్వీకరించమని అ మణిని కూడా కానుకగా ఇచ్చాడు.

శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరిం చి, మణిని మృదువుగా తిరస్కరించాడు. ఒక శుభముహుర్తమున శ్రీకృష్ణుడు సత్యభామనీ, జాంబవతినీ పెళ్ళి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణునితో స్వామీ! మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు. మాబోటి అల్పుల మాటేమిటి? అన్నారు. శ్రీహరి వారియందు దయతలిచి 'బాధ్రపద శుద్ధ చవితిరోజు ప్రమాదవశమున చంద్ర దర్శనము అయినా, ఆ రోజు ప్రొద్దున గణపతిని యధావిధిగా పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు గాక 'అని ఆనతీయగా దేవతలు, మునులు సంతోషించారు.

'కాబట్టి మునులారా! అప్పటినుంచి ప్రతి సంవత్సరము బాధ్రపద శుద్ధ చరుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు, అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు ' అని సూతముని శౌనకాది మునులతో చెప్పారు. ఇది వినాయక మహత్యం

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now