Akshaya Tritiya 2020: నేడు 'అక్షయ తృతీయ 2020' పర్వదినాన ఆన్‌లైన్‌లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి? ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేసే మార్గాలు మరియు అక్షయ తృతీయ యొక్క విశిష్ఠతను తెలుసుకోండి
నూతనంగా ఏదైనా మొదలు పెడతారు, ముఖ్యంగా బంగారం లాంటి విలువైన ఆభరణాలను కొనుగోలుచేస్తారు. ఈరోజు కొనుగోలు చేస్తే అది ఎప్పటికీ వృద్ధి చెందుతుందనేది వారి నమ్మకం. ఈ నమ్మకమే బంగారం అమ్మేవారికి ఇటీవల కాలంలో పెట్టుబడిగా మారింది.......
Akshaya Tritiya 2020: హిందూ సమాజంలో 'అక్షయ తృతీయ' అనే పర్వదినం గత కొన్నేళ్లుగా చాలా ప్రాచుర్యంలోకి వస్తోంది. పురాణాల ప్రకారం వైశాఖ శుద్ధ తదియ నాడు తలపెట్టే ఏ కార్యమైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అంటే ఎన్నటికీ తరిగిపోదు, ఎప్పటికీ నిలిచే ఉంటుంది అని అర్థం. అది ధనమైనా, పుణ్యమైనా లేదా పాపమైనా. పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పినట్లు మత్స్య పురాణంలో పేర్కొనబడింది. ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది, ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెప్తారు.
అయితే, అక్షయ తృతీయ నాడు ఏ కార్యం తలపెట్టినా అక్షయం అవుతుందనే నమ్మకంతో హిందూ సమాజంలోని కొన్ని వర్గాలు ఈరోజు ఎంతో శుభదినంగా భావిస్తారు. నూతనంగా ఏదైనా మొదలు పెడతారు, ముఖ్యంగా బంగారం లాంటి విలువైన ఆభరణాలను కొనుగోలుచేస్తారు. ఈరోజు కొనుగోలు చేస్తే అది ఎప్పటికీ వృద్ధి చెందుతుందనేది వారి నమ్మకం. ఈ నమ్మకమే బంగారం అమ్మేవారికి ఇటీవల కాలంలో పెట్టుబడిగా మారింది.
ప్రతీ ఏడాది అక్షయ తృతీయ నాడు జ్యువెలరీ దుకాణాలు కొనుగోలుదార్లతో కిటకిటలాడేవి, ఈ ఏడాది కరోనావైరస్ ప్రభావంతో లాక్డౌన్ విధించబడి అంతా మూతబడ్డాయి. అయితే బంగారాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు కొన్ని ప్రముఖ జ్యువెలరీ షోరూంలు వీలు కల్పిస్తున్నాయి.
ఇక ఈరోజు (26/04/2020) బంగారం ధరలు హైదరాబాద్ లో 22 కారట్ల శుద్ధమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 42,610/- గా ఉండగా, 24 కారట్ల శుద్ధమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 45,920/- గా ట్రేడ్ అవుతోంది.
ఆన్‌లైన్‌లో బంగారం ఎలా కొనాలి?
- తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి ప్రసిద్ధ జ్యువెలరీ అమ్మకందార్లు తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో బంగారాన్ని విక్రయిస్తున్నాయి. మీరు వారి అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించి, అందుబాటులో ఉన్న వివిధ ఆభరణాలను ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయడం ద్వారా మీకు నచ్చినదాన్ని కొనుగోలు చేయవచ్చు.
- నివేదికల ప్రకారం, ఎస్బీఐ, ఫోన్‌పే మరియు పేటీఎం వంటి ఆర్థిక సాంకేతిక సంస్థలు తమ యాప్స్ లలో ఫిజికల్ మరియు డిజిటల్ బంగారాన్ని MMTC-PAMP లేదా సేఫ్ గోల్డ్‌తో భాగస్వామ్యం చేస్తున్నాయి. వినియోగదారులు కొనుగోలు చేసిన బంగారాన్ని లాకర్ సౌకర్యాలతో MMTC-PAMP లేదా సేఫ్ గోల్డ్‌తో నిల్వ చేస్తారు. అయితే, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మాత్రమే మీరు కొనుగోలు చేసిన బంగారం డెలివరీ జరుగుతుందని ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది.
- మీకు ఉన్న మరో ఆప్షన్ ఏమిటంటే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్). స్టాక్ ఎక్స్ఛేంజ్ నేరుగా ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేయవచ్చు, అయితే అందుకు మీకు ట్రేడింగ్ డిమాట్ ఖాతా అవసరం.
- మరో ఆప్షన్ 'సావరిన్ గోల్డ్ బాండ్స్' (ఎస్జిబి) కూడా ఉంది. ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే జారీ చేయబడిన ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు. ఒక వ్యక్తికి 1 గ్రాము నుండి గరిష్టంగా 4 కిలోల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే దీని మెచూరిటీ కాలం 8 సంవత్సరాలు. అందుకు వడ్డీ కూడా లభిస్తుంది.
ఇవీ, ఆన్‌లైన్‌లో బంగారం కొనడానికి అందుబాటులో ఉన్న మార్గాలు. అయితే కొనుగోలు చేసే ముందు, వెనకా ఆలోచించి, మనం ఎంత ఖర్చు చేస్తున్నాం, దాని విలువ ఎంత? లాభమా.. నష్టమా? అన్ని బేరీజు వేసుకుకొని కొనుగోలు చేయండి. గుర్తింపు లేని అమ్మకందార్ల నుంచి ఆన్‌లైన్‌లో కొని మోసపోకండి. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉన్నందున ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. ఇంట్లో ఉండే అక్షయ తృతీయ పండుగను ఆస్వాదించండి.