Janmashtami: శ్రీకృష్ణుడు ఎవరు? దేవుడా..లేక మనిషా ? ఆయన బోధనలు ఎలా మనుషుల్ని, మహోన్నత వ్యక్తుత్వాలుగా ఎలా మలుచుతాయి?!
శ్రీకృష్ణుడి జీవితం ఆధారంగా వచ్చిన అనేక కథలు మరియు ఎపిసోడ్లు అతని వ్యక్తిత్వాన్ని మరియు అతను మానవాళికి చాటిని గొప్ప సందేశాన్ని తెలియజేస్తాయి.మెరుగైన జీవితాన్ని ఆనందించాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి మనం నేర్చుకోగల పాఠాలు ఇవే...
Hyderabad, August 23: శ్రీకృష్ణుడు అంటే ఎవరు? అని ఒక శిష్యుడు, ఇస్కాన్ ISKCON వ్యవస్థాపకుడైన భక్తి వేదాంత ప్రభుపాదని అడిగాడు. అందుకు ఆయన నుంచి వచ్చిన సమాధానం - "ఆయనో చారిత్రకమైన వ్యక్తి. భగవంతుని యొక్క అత్యున్నత వ్యక్తిత్వానికి ఆయన ప్రతిరూపం." అని చెప్పారు.
పురాణేతిహాసాల ప్రకారం కృష్ణుడిని విష్ణువు యొక్క 8వ అవతారంగా చెప్తారు. పవిత్ర హిందూ త్రిమూర్తులలో బ్రహ్మ (సృష్టికర్త), విష్ణు (సృష్టిని నడిపించేవాడు) మరియు శివుడు (లయకారుడు) గా భావిస్తారు. శ్రీకృష్ణుడి మాటలు మానవాళికి భగవద్గీతను ఇవ్వడమే కాక, ఆయన బోధనలు మనిషిని కష్ట సమయాల్లో కూడా ముందుకు నడిపేలా ప్రోత్సాహమిస్తాయి. నేడు జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడు చాటిన జీవిత సత్యాలను తెలుసుకోవడం ద్వారా అవి ప్రతి మనిషి సానుకూల వైఖరితో ముందుకు సాగేలా ఎంతగానో ఉపయోగపడతాయి.
శ్రీకృష్ణుడి జీవితం ఆధారంగా వచ్చిన అనేక కథలు మరియు ఎపిసోడ్లు అతని వ్యక్తిత్వాన్ని మరియు అతను మానవాళికి చాటిని గొప్ప సందేశాన్ని తెలియజేస్తాయి.
మెరుగైన జీవితాన్ని ఆనందించాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి మనం నేర్చుకోగల పాఠాలు ఇవే.
1. నీ వృత్తి ధర్మాన్ని పాటించడమే దేవునిపై నీవు చూపే నిజమైన భక్తి.
ఎవరైతే వారి వృత్తిని నిజాయితీగా, నిబద్ధతతో నిర్వహిస్తారో అదే వారు దేవునిపై చూపించే నిజమైన భక్తి. వృత్తి ధర్మాన్ని పాటించడానికి మించిన భక్తి వేరొకటి లేదని శ్రీకృష్ణుడు సందేశమిచ్చాడు.
2. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందని శ్రీకృష్ణుడి జీవితం మనకు బోధిస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తామనే దానిపైన ఆధారపడి ఉంటుంది. కొన్ని సమస్యలను శక్తితో ఎదుర్కోవాల్సి ఉంటుంది, మరికొన్నింటిని యుక్తితో ఎదుర్కోవాల్సి ఉంటుంది. కౌరవులతో భీకర యుద్ధం సాగుతున్నప్పుడు సైతం శ్రీకృష్ణుడు ప్రశాంత మనస్సుతో సవాళ్లను ఎదుర్కొన్నాడు.
3. ఫలితం ఎలా అయినా ఉండనీ, ప్రయత్నాన్ని ఆపకూడదు.
ఏదైనా పనిచేసేటపుడు ఫలితం ఆశించకూడదు అని పెద్దలు చెప్తారు. దీనిని వాస్తవానికి శ్రీకృష్ణుడు గీతలో ఎలా బోధించాడంటే.ఏదైనా అనుకున్నపుడు వందశాతం మన ప్రయత్నాన్ని జోడించాలి. రాబోయే ఫలితం ఎలాగైనా ఉండనీ, కానీ ప్రయత్నంలో నిబద్ధత ఉండాలి.
ఇక్కడ ప్రక్రియ ముఖ్యం, ఆ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యేదే ఫలితం, అది ఒక బై-ప్రొడక్ట్ మాత్రమే అని గీతలో ఉంది.
4. సమస్య నీలోపలే ఉంది.
ఒకరి సమస్యలకు మూలకారణం వారే. జీవితంలో వచ్చే సమస్యలన్నింటిలో ఎక్కువ భాగం ఎవరికి వారే సృష్టించుకోబడినవి. కాబట్టి జీవితంలో సవాళ్లు ఎదురైనపుడు వేరొకరిని నిందించకుండా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రపంచంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదురించగల దృక్పథం మీలో కలుగుతుందని గీతోపదేశం చేశాడు.
5. మీ హక్కు కోసం పోరాడండి
మీ హక్కుల కోసం పోరాడండని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తాడు. మీ వాదనలో నిజముంటే, మీకు అన్యాయం జరిగిందని భావిస్తే, ఖచ్చితంగా హక్కుల కోసం పోరాడాలని శ్రీకృష్ణుడు బోధిస్తాడు. అందుకే కౌరవులతో యుద్ధం జరుగుతున్నపుడు, పాండవుల పక్షాన నిలిచి రణతంత్రాన్ని దగ్గరుండి నడిపించాడు. ఒక దశలో అర్జునుడు వెనక్కి తగ్గినా, అతడికి భగవద్గీతను బోధించి, 'నీ హక్కు కోసం నువ్వు పోరాడు అని' ముందుకు నడిపించి రథసారథి అయ్యాడు శ్రీకృష్ణుడు.