Coronavirus: కరోనా నుంచి కోలుకున్నా ఏడాది తర్వాత మళ్లీ అవే లక్షణాలు, నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు వంటి సమస్యలు ఉన్నట్లు తెలిపిన తాజా అధ్యయనం, ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన కథనం
ఆ వ్యాధి తగ్గిన ఏడాది తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని (persistent symptoms after one year) తాజా అధ్యయనంలో తేలింంది. చైనాలోని వుహాన్‌లో జరిగిన ఈ అధ్యయనం శుక్రవారం ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది.
New Delhi, August 28: కరోనావైరస్ సోకి ఆస్పత్రిలో చేరిన వారిలో.. ఆ వ్యాధి తగ్గిన ఏడాది తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని (persistent symptoms after one year) తాజా అధ్యయనంలో తేలింంది. చైనాలోని వుహాన్‌లో జరిగిన ఈ అధ్యయనం శుక్రవారం ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా సోకినప్పటి నుంచి 12 నెలల పాటు 1,276 మందిపై (One half of hospitalized COVID-19 patients) ఈ అధ్యయనం చేసినట్లు వుహాన్‌లోని చైనా–జపాన్ ప్రెండ్షిప్ హాస్పిటల్ ప్రొఫెసర్ బిన్ కావ్ తెలిపారు.
ఈ అధ్యయనంలో ఉన్న చాలా మంది కరోనా (Coronavirus Scare) నుంచి బాగానే కోలుకున్నప్పటికీ, వ్యాధి ముదిరి ఐసీయూ వరకు వెళ్లిన రోగులకు మాత్రం ఏడాది తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. 2020 జనవరి 7 నుంచి మే 29 మధ్య డిశ్చార్జ్ అయిన వారిపై ఈ ప్రయోగం జరిగిందని అధ్యయనకారులు పేర్కొన్నారు.
కరోనా సోకిన వారిని (COVID-19 patients), సోకని వారిని పోల్చి చూస్తే వ్యాధి సోకిన వారు ఏడాది తర్వాత కూడా వ్యాధి సోకని వారిలా ఆరోగ్యంగా లేరని లాన్సెట్ జర్నల్ తెలిపింది. కరోనా నుంచి కోలుకోవడానికి కొందరికి ఏడాదికి పైగా సమయం పడుతుందని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైనందున, కోవిడ్ అనంతరం ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అధ్యయనం అభిప్రాయపడింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులకు సంబంధించిన ఆరోగ్య వివరాలను ఆరు నెలల తర్వాత మొదటి సారి, పన్నెండు నెలల తర్వాత రెండో సారి సేకరించినట్లు వెల్లడించింది.
కరోనా సోకి నయమైన వారిలో చాలా మందికి ఏ లక్షణాలు లేకుండా పోగా, సగం మందిలో మాత్రం పలు లక్షణాలను అధ్యయనకర్తలు గుర్తించినట్లు లాన్సెట్ వెల్లడించింది. నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు అత్యంత ఎక్కువగా కనిపించినట్లు లక్షణాలని తెలిపింది. పన్నెండు నెలల తర్వాత కూడా ప్రతి ముగ్గురిలో ఒకరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. లక్షణాలు కనిపించిన వారిలో.. కరోనా సోకిన సమయంలో ఐసీయూ వరకు వెళ్లి ఆక్సిజన్ ట్రీట్మెంట్ పొందిన వారు అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది.
349 మందికి లంగ్ ఫంక్షన్ టెస్టు (ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష) నిర్వహించామని, వారిలో 244 మందికి 12 నెలల తర్వాత కూడా అదే పరీక్షను తిరిగి నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు. ఆరు నెలల సమయంలో నిర్వహించిన పరీక్షలో వచ్చిన ఫలితాలే సంవత్సరం తర్వాత కూడా వచ్చాయని, ఏ మాత్రం మెరుగు పడలేదని తాము గుర్తించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మరో 353 మందికి ఆరు నెలల తర్వాత సీటీ స్కాన్ చేయగా, వారిలో సగం మంది ఊపిరితిత్తులు అసహజ పనితీరును చూపినట్లు తెలిపారు. అనంతరం 12 నెలల తర్వాత 118 మందికి సీటీ స్కాన్ నిర్వహించగా, అసహజ పనితీరు తగ్గినట్లు గుర్తించామని తెలిపారు.
పురుషులతో పోలిస్తే మహిళల్లో నీరసం, కండరాల బలహీనత 1.4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని లాన్సెట్ జర్నల్ తెలిపింది. స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో కూడా 1.5 రెట్లు ఎక్కువ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. అయితే ఈ పరిశోధన మొత్తం ఒకే ఆస్పత్రిలో (Jin Yin-tan Hospital) చేరిన వారిపై జరిగిందని, అందువల్ల అన్ని ప్రాంతాలకు దీన్ని వర్తింపజేయలేమని పరిశోధనలో పాల్గొన్న జియోయింగ్ గున్ అభిప్రాయపడ్డారు.