Cold- Cough Home Remedies: దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారా? ఇంటి వద్దనే ఈ ప్రభావవంతమైన చిట్కాలు ప్రయత్నించండి, తక్షణ ఉపశమనం పొందండి!

cold cough remedies| Pic: Pixabay

Cold- Cough Home Remedies: వాతావరణం మారినప్పుడు లేదా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ సోకినపుడు దగ్గు- జలుబు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. జలుబు ఏమంత తీవ్రమైన అనారోగ్యం కానప్పటికీ, ఈ అనారోగ్యంతో వ్యవహరించడం చాలా అసౌకర్యంగా, నిద్రించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా జలుబుతో బాధపడుతున్నప్పుడు చాలా బలహీనంగా మారినట్లు భావిస్తాడు, పనులు చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఈ దగ్గు, జలుబు అనేవి కొన్ని వారాల పాటు వ్యక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందు కొన్ని ఇంటి చిట్కాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. దగ్గు- జలుబు నుంచి ఉపశమనం పొందేందుకు మీరు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

హైడ్రేటెడ్ గా ఉండండి

మీకు జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు మీరు చేయవలసిన ముఖ్యమైన పనులలో ఒకటి హైడ్రేటెడ్‌గా ఉండటం. ఇందుకోసం నీరు, హెర్బల్ టీ, ఇతర ఆరోగ్యకరమైన పానీయాలను పుష్కలంగా తాగాలి. ఇది మీ గొంతు తేమగా ఉంచడంలో సహాయపడుతుంది, శ్లేష్మాన్ని తగ్గిస్తుంది, హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల శ్లేష్మం పలుచబడి, మీ శరీరం నుండి బయటకు వెళ్లడం సులభం చేస్తుంది. అదనంగా మీకు జ్వరం ఉన్నట్లయితే లేదా అధికంగా చెమట పట్టినట్లయితే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోండి.

ఆవిరి పట్టండి

ఆవిరి పట్టుకోవడం ద్వారా జలుబుతో వచ్చే గొంతునొప్పి, తలనొప్పిల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. వెచ్చని ఆవిరి గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో నీరు, పసుపు వేసి మరిగించండి, ఆపై ఈ వేడి నీటి గిన్నె మీద మీ తలను వాల్చి ఆవిరి పీల్చండి లేదా మీ పడకగదిలో హ్యూమిడిఫైయర్‌ని ఉపయోగించడం ద్వారా ఆవిరిని పీల్చుకోవచ్చు. ఈ ఆవిరిలో యూకలిప్టస్ లేదా పిప్పరమెంటు వంటి ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలను కలపడం వలన మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

గోరువెచ్చని ఉప్పు నీరు పుక్కిలించండి

గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి గొంతును గరగరలాడించడం అనేది గొంతు నొప్పికి సులభమైన, సమర్థవంతమైన పరిష్కారం. ఉప్పు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది, గొంతులో చేరిన హానికర బ్యాక్టీరియాను చంపుతుంది. అదేసమయంలో గోరువెచ్చని నీరు ఉపశమనాన్ని అందిస్తుంది. ఉప్పునీటితో గొంతు పుక్కిలించడానికి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పును కరిగించి, నోట్లో వేసుకొని సుమారు 30 సెకన్ల పాటు గరగరలాడించండి. మీకు ఉన్న అసౌకర్యం నుండి ఉపశమనానికి రోజుకు కొన్ని సార్లు దీనిని పునరావృతం చేయండి.

తేనే- నిమ్మరసం తీసుకోండి

తేనె, నిమ్మరసం అనేవి సహజంగా లభించే పదార్ధాలు. వీటిలో ఓదార్పు కలిగించే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. గోరువెచ్చని నీటిలో లేదా హెర్బల్ టీలో తేనె, నిమ్మరసం కలపి తాగడం వల్ల దగ్గు మరియు గొంతు నొప్పి లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. తేనె గొంతులోని చికాకును, దగ్గును తగ్గిస్తుంది, నిమ్మరసం రోగనిరోధక వ్యవస్థకు మద్దతుగా విటమిన్ సి అందిస్తుంది. జలుబు, దగ్గు లక్షణాల నుండి ఉపశమనం కోసం రోజుకు కొన్ని సార్లు తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచని పానీయాలను తాగుతూ ఆస్వాదించండి.

విశ్రాంతి తీసుకోండి

జలుబు లేదా దగ్గుతో పోరాడటానికి మీ శరీరానికి అదనపు విశ్రాంతి అవసరం. మీకు అనారోగ్యంగా అనిపించినప్పుడు, తగినంత నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ పనులకు కాస్త విరామం ఇవ్వండి. విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ శరీరం శక్తిని ఆదా చేస్తుంది, స్వీయ చికిత్సను చేసుకుంటుంది. ప్రశాంతంగా నిద్రపోవడానికి మీ గదిలో అనుకూలమైన సౌకర్యవంతమైన, నిశ్శబ్ద వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి. అవసరమైతే పగటిపూట చిన్న కునుకు తీసుకోవడం గురించి ఆలోచించండి.