Pumpkin Seeds: గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే లాభాలు, మీ ఆరోగ్యానికి దీన్ని మించి మరే ఔషధం లేదని చెబుతున్న వైద్యులు, ఉపయోగాలు ఏంటో ఓ సారి చూడండి
పనిభారం ఎక్కువ కావడంతో త్వరగా అలిసిపోతున్నాడు. ఈ నేపథ్యంలో మారుతున్న జీవనశైలికి అనుగుణంగా శరీరానికి తగినంత పోషకాలు అనేది చాలా ముఖ్యమైపోయింది.
ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనిషికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైపోయింది. పనిభారం ఎక్కువ కావడంతో త్వరగా అలిసిపోతున్నాడు. ఈ నేపథ్యంలో మారుతున్న జీవనశైలికి అనుగుణంగా శరీరానికి తగినంత పోషకాలు అనేది చాలా ముఖ్యమైపోయింది. అందువల్ల మంచి పోషకాలు ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో గుమ్మడి గింజలు తీసుకోవడం శరీరానికి మేలు చేస్తుందని వివరిస్తున్నారు. గుమ్మడి గింజలను (Health Benefits of Pumpkin Seeds) ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఆహారానికి రుచి కూడా వస్తుందని అంటున్నారు.
ఆహార పదార్థాల్లో మెగ్నీషియం లభించడం తక్కువ. అయితే గుమ్మడి గింజల్లో (pumpkin seeds) మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు తోడ్పడుతుంది. అలాగే గుండె, ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం తగిన స్థాయిలో అందడం చాలా ముఖ్యం. ఇక గుమ్మడి గింజల్లో (Pumpkin Seeds Uses) ట్రిప్టోఫాన్ అనే కీలకమైన అమైనో ఆమ్లం తగిన స్థాయిలో ఉంటుంది. దానితోపాటు 5-హైడ్రాక్సిట్రిప్టోఫాన్ అనే ట్రిప్టోఫాన్ మెటాబోలైట్ పదార్థం కూడా ఉంటుంది. ఈ రెండూ కూడా మనలో మానసిక ఒత్తిళ్లను తగ్గించేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు కూడా.
గుమ్మడి గింజల్లోని ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు గణనీయ స్థాయిలో ఉంటాయి. ట్రైగోనెలిన్, డి-చిరో-ఇనోసిటాల్, నికోటినిక్ యాసిడ్ లుగా పిలిచే ఈ సమ్మేళనాలు శరీరంలో ఇన్సూలిన్ తగిన స్థాయిలో విడుదలవడానికి తోడ్పడతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. రక్తంలోని హిమోగ్లోబిన్ లో కీలకమైన ఐరన్ స్థాయి తగిన స్థాయిలో ఉండేందుకు గుమ్మడి గింజలు తోడ్పడుతాయి.
గుమ్మడి విత్తనాల్లోని పోషకాలు వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడుతాయి. వెంట్రుకలు రాలిపోవడం, బలహీనమవడం వంటి సమస్యలకు కారణమైన 5-రిడక్టేజ్‌ను గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్స్ అడ్డుకుంటాయని నిపుణులు చెప్తున్నారు. గుమ్మడి గింజల్లో ఇతర పోషకాలతోపాటు జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇది అద్భుతమైన రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ఇదే సమయంలో మెదడు, చర్మంతోపాటు శరీరంలోని ఇతర అవయవాల ఆరోగ్యకర పనితీరుకు కూడా పనికి వస్తుంది. అంతేగాకుండా అధిక జింక్ పురుషులలో స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. సంతానోత్పత్తిని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.
సాధారణంగా రోజూ తీసుకునే ఆహారంలో (పెరుగు, పండ్లు, సలాడ్లు సూప్, కుకీలు, బ్రెడ్, తీపి పదార్థాలు) కొన్ని గుమ్మడి గింజలను వేసుకోవడం అలవాటుగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.గుమ్మడి గింజలను అలంకరణగా వాడటం వల్ల అటు అందం, ఇటు ఆరోగ్యం రెండూ సమకూరుతాయని అంటున్నారు.