Side Effects of Xylazine: జాంబిలుగా మార్చుతున్న జైలజీన్ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవిగో, చర్మంలో అవయువాలు కుళ్లిపోయి, నడిచే శవాల్లా మారుతున్న బాధితులు
గుర్రాలు, ఆవులు తదితర జంతువుల్లో నరాలకు విశ్రాంతి ఇచ్చే నిమిత్తం అనుమతించిన ఈ ట్రాంక్విలైజర్ ఇప్పుడు మనుషుల ప్రాణాలు హరించే మహమ్మారిగా (How does it Affect Humans) మారుతోంది
ఫిలడెల్పియాలో మొదలైన జాంబీ డ్రగ్ జైలజీన్ ఇప్పుడు అమెరికా మొత్తాన్ని వణికిస్తోంది. గుర్రాలు, ఆవులు తదితర జంతువుల్లో నరాలకు విశ్రాంతి ఇచ్చే నిమిత్తం అనుమతించిన ఈ ట్రాంక్విలైజర్ ఇప్పుడు మనుషుల ప్రాణాలు హరించే మహమ్మారిగా (How does it Affect Humans) మారుతోంది. ఈ డ్రగ్ ని మరో డ్రగ్ ఫెంటానిల్ తో కలిపి డీల్లరు మత్తుమందును తయారుచేస్తున్నారు. ఇది తీసుకున్న అమెరికన్లు జాంబిలుగా మారుతూ ప్రాణాంతకంగా తయారవుతున్నారు.
ట్రాంక్, ట్రాంక్ డోప్, జాంబీ డ్రగ్ అంటూ వివిధ రకాలతో పిలిచే ఈ డ్రగ్ (zombie drug ) మత్తులో అమెరికన్లు ఊగిపోతున్నారు. వీధుల్లో ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. ఈ డ్రగ్ తీసుకున్న వారికి తీవ్ర దుష్ప్రభావాలు తప్పవని (Side Effects of Xylazine) నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటిపై పుండ్లు పడటం, చర్మం ఊడిపోవడంతో పాటు శరీరంలొ అన్ని శక్తులు చచ్చిపోతాయి. అడుగు తీసి అడుగేయడమూ కష్టమైపోతుంది. బాధితులు నడిచే శవాల్లా మారిపోతారు.
న్యూయార్క్, మసాచుసెట్స్, మైన్, పశ్చిమ తీరంలో కాలిఫోర్నియా, ఓరెగాన్, వాషింగ్టన్, దక్షిణాన టెక్సాస్, లూసియానా, అలబామా... ఇలా 36కు పైగా రాష్ట్రాల్లో వేలాది జాంబీ కేసులు నమోదు అయ్యాయి.ఫిలడెల్ఫియాలోనే ఏకంగా 90 శాతానికి పైగా డోప్ టెస్ట్ శాంపిళ్లలో జైలజీన్ జాడలు కన్పించాయి. న్యూయార్క్ నగరంలో 25 శాతానికి పైగా శాంపిళ్లలో జైలజీన్ బయటపడిందంటే అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.
గుర్రాలు, ఆవులు, గొర్రెలపై వాడేందుకు దీన్ని 1962లో తయారు చేయగా..అప్పట్లోనే మనుషులపై ప్రయోగాలు కూడా చేశారు. అయితే మనుషుల్లో శ్వాస, హృదయ స్పందన, బీపీ తగ్గిపోవడంతో దీన్ని ఆపేశారు. ఆ తరువాత హెరాయిన్ ప్లేసులో దీన్ని వాడకానికి తీసుకువచ్చారు. పైగా హెరాయిన్ కన్నా ఇది చాలా చౌకగా ఉండటంతో దీన్ని ఎక్కువగా మత్తు బాబులు వినియోగించడం మొదలు పెట్టారు.
అయితే ఇది వాడటం చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జైలజీన్ చర్మాన్ని, మాంసాన్ని తినేస్తుందని, కేంద్ర నాడీ వ్యవస్థపై నేరుగా తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. రక్తనాళాలు పూర్తిగా చెడిపోయి రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందని అన్నారు. ఇది తీసుకోవడం వల్ల పుండ్లు ముదిరి సంబంధిత అవయవాలు కుళ్లిపోతున్నాయి.దీంతో వైద్యులు వాటిని తీసేయాల్సి వస్తోంది.మతిమరుపు, గుండె, ఊపిరితిత్తుల పనితీరు, కంటిచూపు మందగించడం ఇలా ఎన్నో సమస్యలు వారిని వెంటాడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.