Jagannath Rath Yatra 2023: జై జగన్నాథ నినాదాలతో హోరెత్తిన పూరీ నగరం, ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్ర, హింస కారణంగా మణిపూర్‌లో జగన్నాథ రథయాత్ర రద్దు
జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు
ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రంతో పాటు అక్కడి వీధులన్నీ కిక్కిరిపోతున్నాయి. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగరం హోరెత్తుతోంది.
సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నట్టు శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య పరిపాలనా అధికారి రంజన్ కుమార్ దాస్ తెలిపారు. బలభద్ర, సుభద్ర, శ్రీ జగన్నాథుడి విగ్రహాలను శ్రీ గుండిచ ఆలయం వరకు రథ యాత్రతో తోడ్కొని వెళతారు. 12వ శతాబ్దం నాటి మందిరం ముందు ఉంచుతారు.భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున 80 ప్లాటూన్ల బలగాలను మోహరించారు. ఒక్కో ప్లాటూన్ లో 30 మంది పోలీసులు ఉంటారు. సాగరతీరం కావడంతో తీరంలో కోస్ట్ గార్డ్ కు చెందిన హెలికాప్టర్ సైతం గస్తీ నిర్వహిస్తోంది. పూరీ రథయాత్ర నేపథ్యంలో 125 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది.
పూరీ రథయాత్ర ప్రారంభానికి ముందు ఢిల్లీలోని హౌజ్ కాస్ లో ఉన్న జగన్నాథ్ మందిరం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రార్థనలు నిర్వహించారు. పూరీ రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఈ పవిత్ర ఉత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా జగన్నాథ స్వామి మన జీవితాలను ఆరోగ్యం, సంతోషం, ఆధ్యాత్మిక భావనలతో నిండుగా ఉంచాలని కోరుకుంటున్నాను’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ పూరీ చేరుకున్నారు. పూరీ శంకరాచార్య స్వామి అయిన నిశ్చలానంద సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇక 100 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న, వేలాది మందిని అంతర్గతంగా నిరాశ్రయులైన జాతి హింస కారణంగా మణిపూర్ మంగళవారం వార్షిక రాచరిక రథయాత్ర ఊరేగింపును చేయడం లేదని తెలిపింది.