Tirumala Srivari Brahmotsavam: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్, ఈ నెల 15వ తేదీ నుంచి 9 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు, 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
అక్టోబర్ 19వ తేదీన గరుడ సేవ, 20వ పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
Brahmotsavam at Tirumala 2023: ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీన గరుడ సేవ, 20వ పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. వాహన సేవలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గరుడ సేవను సాయంత్రం 6.15 నిమిషాలకే ప్రారంభించేందుకే సన్నాహాలు చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు.
బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు. 15 రాష్ట్రాల నుంచి వచ్చే కళా బృందాలు వాహన సేవల ముందు ప్రదర్శనలు ఇస్తాయన్నారు.వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను సరఫరా చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వం తరుపున టీటీడీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు.
ఉత్సవాల సమయంలో ప్రభుత్వం తరుపున పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలని తిలకించేందుకు దేశం నల మూలల నుంచి భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖ తరుపున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.