Treasure Pot: తెలంగాణలోని జనగామ జిల్లాలో బయటపడ్డ లంకె బిందె, సుమారు 5కేజీల బంగారు, వెండి అభరణాలు లభ్యం, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది
అయితే గురువారం ప్రొక్లైయినర్ తో భూమిని చదును చేస్తుండగా భూమిలోపల నుంచి ఒక రాయిలా ఉన్న కుండ బయటపడింది. తీరా అందులో ఏముందని చూస్తే కళ్లు విస్తుపోయేలా బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి...
Jangaon, April 8: ఎవరిదైనా ఒక్కసారిగా దశ తిరిగితే ఏమంటారు? లంకె బిందెలేమైనా దొరికయా? అని సాధారణంగా అనడం మనం చాలా సార్లు వినుంటం. కానీ నిజంగానే అలా లంకెబిందె దొరికిన ఘటన తెలంగాణలోని జనగాం జిల్లాలో చోటుచేసుకుంది.
ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు, జనగాం జిల్లాలోని పెంబర్తి గ్రామంలో నర్సింహా అనే వ్యక్తి, ఒక వెంచర్ అభివృద్ధి చేయడం కోసం నెలరోజుల క్రితం 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే గురువారం ప్రొక్లైయినర్ తో భూమిని చదును చేస్తుండగా భూమిలోపల నుంచి ఒక రాయిలా ఉన్న కుండ బయటపడింది. తీరా అందులో ఏముందని చూస్తే కళ్లు విస్తుపోయేలా బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ఆ బిందెలో సుమారు 5 కిలోల వరకు బంగారం ఉన్నట్లు నర్సింహ చెబుతున్నారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. లంకెబిందె బయటపడిన విషయం ఆ నోటా ఈ నోటా విన్న ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసులు వారిని కట్టడి చేసి లంకెబిందెను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే లంకెబిందెపై పోలీసులు ఇంకా విచారణ చేపట్టాల్సి ఉంది. భూమి యజమాని నర్సింహ మాత్రం లంకె బిందె దొరకడంతో ఉద్వేగానికి లోనై పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాడు. లంకెబిందెలో దొరికిన ఆభరణాలు దేవతామూర్తుల విగ్రహాలకు అలంకరించేలా ఉండటంతో తాను కొనుగోలు చేసిన ఆ భూమిలో, కొద్ది పాటి స్థలంలో గుడి కట్టిస్తానని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, స్థానికంగా భూములు కలిగిన ప్రజలు తమ భూముల్లో కూడా ఏమైనా లభ్యమవుతాయా? అన్న ఆశతో భూములను తవ్వడం, చదును చేయడం చేస్తున్నట్లు తెలియవచ్చింది.