Don Rickles: ఆర్టిస్ట్ చనిపోయినా, అతడి వాయిస్‌ను బ్రతికించి సినిమా పూర్తి చేశారు. అదెలాగా?

అయితే ఆయన స్థానంలో వేరే వాళ్లలో వాయిస్ చేయించకుండా, అతడి గొంతునే ఎలా వాడింది?...

Toy Story 4- Don Rickles | Photo Credits: Getty Images

వాల్ట్ డిస్నీ నిర్మాణ సంస్థ నుంచి  టాయ్ స్టోరీ 4  (Toy Story 4) అనే 3డీ యానిమేషన్ ఫిల్మ్ జూన్ 21, 2019 ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది.  పిల్లలు అమితంగా ఇష్టపడే టాయ్ స్టోరీ సినిమాల నుంచి వచ్చిన నాలుగో సీక్వెల్ ఇది.  ఈ యానిమేషన్ సినిమాలో వచ్చే చిత్ర విచిత్రమైన క్యారెక్టర్లను చూసి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా అవి మాట్లాడే మాటలు చాలా నవ్వు తెప్పిస్తాయి.

దీనిలో Mr. Potato Head అని ఆలుగడ్డ ఆకారంలో ఒక కామెడీ క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ మాట్లాడే మాటలు చాలా గమ్మత్తుగా ఉంటాయి, ముఖ్యంగా ఆ వాయిస్‌కే నవ్వొస్తుంది. ఈ మాటల వెనక ఉన్నది డాన్ రికిల్స్ (Don Rickles) అనే ప్రఖ్యాత కమెడియన్.

అమెరికాకు చెందిన డాన్ జేయ్ రికిల్స్ స్టాండప్ కామెడీ షో లతో(Stand-up Comedy) చాలా పాపులర్.  నటుడిగా, రచయితగా, వాయిస్ ఆర్టిస్ట్‌గా రికిల్స్ కి మంచి గుర్తింపు ఉంది.

ఎన్నో యానిమేషన్ సినిమాలలోని కామెడీ క్యారెక్టర్లకు డబ్బింగ్ చెప్పి ఆయన వాయిస్‌తో ఆ క్యారెక్టర్లకు జీవంపోశాడు. అలాగే మొదటి 3 టాయ్ స్టోరీ సీక్వెల్స్ లలో ఆలుగడ్డ క్యారెక్టర్‌కు రికిల్స్ తన వాయిస్‌ను అందించాడు. టాయ్ స్టోరీ 4కి కూడా పిక్సర్ సంస్థ రికిల్స్‌ తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయింది. ఇక ఆర్టిస్టుల వాయిస్‌లు రికార్డ్ చేయడమే తరువాయి అనగా 2017లో  రికిల్స్ కన్నుమూశారు.  అప్పటికీ టాయ్ స్టోరీ4 కోసం రికిల్స్ కనీసం ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు. దీంతో ఆయన వాయిస్‌ను ఎవరితో పూర్తి చేయాలి అని తర్జనభర్జనలకు గురైన పిక్సర్ సంస్థ, చివరకు ఆ క్యారెక్టర్‌కు అతడి వాయిస్‌నే ఉంచేయాలని డిసైడ్ అయింది.

దీనికోసం రికిల్స్ కు సంబంధించిన గత 25 సంవత్సరాల వాయిస్ రికార్డులన్నీ పరిశీలించింది. ఆయన ఆయన గతంలో మాట్లాడిన మాటల్లోంచే ఇప్పుడున్న స్క్రిప్ట్‌కు కావాల్సిన ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట వెతికి వెతికి వాటినే లూప్‌లో జతచేసి మొత్తానికి ఆ క్యారెక్టర్‌ను రికిల్స్ వాయిస్ తోనే పరిపూర్ణం చేసింది. ఆ విధంగా పిక్సర్స్ సంస్థ ఓ గొప్ప కమెడియన్  అయిన  డాన్ రిక్లెస్‌కు నివాళి  అర్పించింది.