Vijayendra Prasad: రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్, రాజ్యసభకు వస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదని వెల్లడి
సినీ రచయిత, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. విజయేంద్ర ప్రసాద్ చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి కోటాలో విజయేంద్ర రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
ప్రమాణస్వీకారం అనంతరం పార్లమెంట్ ఆవరణలో విజయేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభకు వస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదు. తన కథలే తనను రాజ్యసభకు తీసుకొచ్చాయి. రాజ్యసభకు నామినేట్ కావడం తన బాధ్యతను మరింత పెంచింది. ప్రజా సమస్యలను రాజ్యసభ దృష్టికి తీసుకెళ్తాను అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
విజయేంద్రప్రసాద్ ప్రమాణం చివర్లో 'జైహింద్' అంటూ ముగించారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం కోసం ఇచ్చిన పత్రంలో ఉన్నదే చదవాలని పేర్కొన్నారు. తమ ప్రమాణ పత్రంలో ఉన్న పదజాలానికి ఇతర పదాలను జోడించడం సరికాదని, ఆ అదనపు పదాలు రికార్డుల్లో చేరవని స్పష్టం చేశారు. పైగా, ఎవరైనా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి ప్రమాణ స్వీకారం తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు. ఇది సభ్యులందరికీ వర్తిస్తుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.