President Election 2022: దేశానికి 16వ రాష్ట్రపతి ఎవరో తేలేది మరికొన్ని గంటల్లో.., ఉదయం 11 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, నూతన దేశాధినేత 25న ప్రమాణ స్వీకారం

Yashwant Sinha and Droupadi Murmu. (Photo Credits: ANI)

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. దేశానికి 16వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభవుతుంది. మొదట ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. అనంతరం రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇంగ్లిష్‌ అక్షరక్రమంలో ఒక్కో రాష్ట్ర ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం ఓట్ల కౌంటింగ్‌ అనంతరం తుది ఫలితాలను ప్రకటిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు వెలువనున్నాయి. ఈ నెల 18న పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పదవీకాలం ఈనెల 24తో ముగియనుంది. నూతన దేశాధినేత 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.