RCB vs RR Highlights: చుక్కలు చూపించిన పడిక్కల్, రాజస్థాన్‌పై బెంగళూరు ఘనవిజయం, 10 వికెట్ల తేడాతో జయభేరి; ఈరోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్

కెప్టెన్ కోహ్లీ తాను సింగ్సిల్స్ తీసుకుంటూ దేవదత్ పడిక్కల్ కు ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చాడు. ఇక కెప్టెన్ ఇస్తున్న ప్రోత్సాహంతో పడిక్కల్....

Virat Kohli- Devdutt Padikkal- RCB | Photo: Vivo IL 2021

Mumbai, April 23:  'ఈ సాలా కప్ నందే' అన్నంత కసిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీల్ 2021లో దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టును కోహ్లీ సేన ఉఫ్ అని ఊదిపడేసింది.

మ్యాచ్ సాగిన తీరు, సోర్లు వివరాలకు వెళ్తే.. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) బౌలింగ్ ఎంచుకొంది. దీంతో తొలుత బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) కు ఏమంత శుభారంభం లభించలేదు. ఒపెనర్ జోస్ బట్లర్ 8 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అవగా, మరో ఒపెనర్ వోహ్రా కూడా 7 పరుగులకు ఔట్ అయ్యాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా, మిడిలార్డర్‌లో శివమ్ దుబే 46 పరుగులు, రాహుల్ తివాటియా 40 పరుగులతో ఆదుకోవడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 177 పరుగులు చేసింది.

ఇక 178 పరుగుల లక్ష్యంతో రన్ ఛేజ్ ప్రారంభించిన ఆర్‌సిబి జట్టుకు ఒపెనర్లు విరాట్ కోహ్లీ మరియు దేవదత్ పడిక్కల్ సూపర్ హిట్ అయ్యారు.  కెప్టెన్ కోహ్లీ తాను సింగ్సిల్స్ తీసుకుంటూ దేవదత్ పడిక్కల్‌కు ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చాడు. ఇక కెప్టెన్ ఇస్తున్న ప్రోత్సాహంతో పడిక్కల్ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్విచ్ షాట్లు, అప్పర్ కట్లు మొదలగు అన్ని క్రికెటింగ్ షాట్లతో పడిక్కల్ గ్రౌండ్‌లో అన్ని వైపులా ఫోర్లు, సిక్సర్లతో వీరబాదుడు బాదాడు. 11 ఫోర్లు, 6 సిక్సర్లతో కేవలం 51 బంతుల్లోనే పడిక్కల్ సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో పడిక్కల్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. మరోవైపు నుంచి తన బ్యాటింగ్ వేగాన్ని కూడా పెంచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో 6 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రన్ మిషీన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఈ ఇద్దరి జోడి రాజస్థాన్ బౌలర్లకు ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. బౌలర్లు ఎంత ప్రయత్నం చేసిన తమ వికెట్ నష్టపోలేదు. దీంతో రాజస్థాన్ నిర్ధేషించిన 178 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఓపెనర్లు అలవోకగా 16.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించారు.

స్కోర్లు: రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 177/9

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 16.3 ఓవర్లలో 181/0

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ - దేవదత్ పడిక్కల్.

ఈరోజు చైన్నై వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 నుంచి మ్యాచ్ ప్రారంభం.