KKR Vs SRH: సెంచరీతో చెలరేగిన బ్రూక్స్, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ గెలుపు, రూ. 13 కోట్లకు న్యాయం చేశాడంటున్న ఫ్యాన్స్
ఈ సీజన్‌లో మొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా బ్రూక్ నిలిచాడు. కేవలం 55 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. బ్రూక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బ్రూక్ సాధించిన తాజా శతకంతో కలిపి ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 76 సెంచరీలు నమోదు అయ్యాయి
Kolkata, April 14: సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు మెగా వేలంలో రూ.13.25 కోట్లు పెట్టి ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను తీసుకుంది. అయితే.. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన బ్రూక్ (Harry Brook)తొలి మూడు మ్యాచుల్లో 13, 3, 13 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అన్ని కోట్లు పెట్టి అతడిని అనవసరంగా కొన్నారని సన్‌రైజర్స్ (SRH) ఫాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో తీవ్ర విమర్శల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో (Kolkata) మ్యాచ్‌లో బరిలోకి దిగిన బ్రూక్.. తాను ఎంతటి విధ్వంసకర ఆటగాడినో చూపించాడు. బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్పినర్ల బౌలింగ్‌లో కాస్త ఆచితూచి ఆడిన బ్రూక్, పేసర్లను ఉతికి ఆరేసి శతకంతో చెలరేగిపోయాడు.
ఐపీఎల్‌లో (IPL) బ్రూక్స్ కి ఇది తొలి శతకం కాగా.. ఈ సీజన్‌లో మొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా బ్రూక్ నిలిచాడు. కేవలం 55 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. బ్రూక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బ్రూక్ సాధించిన తాజా శతకంతో కలిపి ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 76 సెంచరీలు నమోదు అయ్యాయి. హ్యారీ బ్రూక్ శతకం చేయడంతో.. మెగా వేలంలో తనను రూ.13 కోట్లకు తీసుకున్నందుకు న్యాయం జరిగినట్లేనని అభిమానులు అంటున్నారు. ఇదే ఊపును మిగిలిన మ్యాచుల్లో కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు.