IND vs IRE: నిప్పులు చెరిగిన బౌలర్లు, రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్, ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

ఫలితంగా ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ పేక మేడలా కూలింది

ICC T20 World Cup 2024: India Beat Ireland By Eight Wickets

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ శుభారంభం చేసింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ విసిరిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 12.2 ఓవర్లలోనే చేధించింది.  తొలుత టీమిండియా పేసర్ల దెబ్బకు ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ అయింది.

టీ20 వరల్డ్‌కప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా న్యూయార్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు.ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ పేక మేడలా కూలింది. హార్దిక్‌ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-35-2), సిరాజ్‌ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్‌ పటేల్‌ (1-0-3-1) ధాటికి ఐర్లాండ్‌ 96 పరుగులకే (16 ఓవర్లలో) కుప్పకూలింది.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో లోర్గాన్‌ టక్కర్‌ (10), కర్టిస్‌ క్యాంపర్‌ (12), గెరాత్‌ డెలానీ (26), జాషువ లిటిల్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డెలానీ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్‌ స్టిర్లింగ్‌ (2), హ్యారీ టెక్టార్‌ (4), జార్జ్‌ డాక్రెల్‌ (3), మార్క్‌ అదైర్‌ (3), బ్యారీ మెక్‌ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.  అక్షర్ పటేల్ అదిరిపోయే క్యాచ్ వీడియో ఇదిగో, డకౌట్‌గా పెవిలియన్ చేరిన ఐర్లాండ్ బ్యాటర్ మెక్‌కార్తీ

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే తడబడింది. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన విరాట్ కోహ్లీ(1) నిరాశ‌ప‌రిచాడు. మార్క్ అడైర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి బౌండ‌రీ వ‌ద్ద జెంజ‌మిన్ చేతికి దొరికాడు. అనంత‌రం రిష‌భ్ పంత్(36), రోహిత్ శ‌ర్మ‌(52)లు కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. అర్థశతకం పూర్తి అయిన తరువాత రోహిత్ శర్మ రిటైర్ హార్ట్ గా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రెండు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.చివరకు భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 12.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.