IPL Auction 2025 Live

ICC U19 Cricket World Cup 2022: చరిత్ర సృష్టించిన యువ భారత్, అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ విక్టరీ, ఐదోసారి కప్ కొట్టిన కుర్రాళ్లు, ప్రశంసిచిన ప్రధాని

ఐదోసారి అండర్‌–19 వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను (ICC U19 Cricket World Cup) సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో(England) శనివారం జరిగిన ఫైనల్లో యశ్‌ ధుల్‌ (Yash Dhull) నాయకత్వంలోని భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.

Antigua, Feb 06: యువ భారత్‌ సంచలనం సృష్టించింది. ఐదోసారి అండర్‌–19 వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను (ICC U19 Cricket World Cup) సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో(England) శనివారం జరిగిన ఫైనల్లో యశ్‌ ధుల్‌ (Yash Dhull) నాయకత్వంలోని భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్‌ రూ (116 బంతుల్లో 95; 12 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు సాధించి గెలిచింది. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ పేస్‌ బౌలర్‌ రవి కుమార్‌ (Ravi kumar) (4/34) హడలెత్తించగా... రాజ్‌ బావా (Raj Bawa ) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందుగా బంతితో ఐదు వికెట్లు తీసిన రాజ్‌ బావా (5/31) ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ (54 బంతుల్లో 35; 2 ఫోర్లు) రాణించాడు.

వైస్‌ కెప్టెన్, ఆంధ్ర కుర్రాడు షేక్‌ రషీద్‌ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు), నిశాంత్‌ (54 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడి అర్ధ సెంచరీలు చేశారు. దినేశ్‌ (5 బంతుల్లో 13 నాటౌట్‌; 2 సిక్స్‌లు) నాటౌట్‌గా నిలిచాడు. ఐదో వికెట్‌కు నిశాంత్, రాజ్‌ 67 పరు గులు జోడించారు. ఓపెనర్‌ అంగ్‌క్రిష్‌ (0) డకౌట్‌ కాగా... హర్నూర్‌ (21; 3 ఫోర్లు), కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ (17; 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించారు. అండర్‌–19 ప్రపంచకప్‌లో భారత్‌ చాంపియన్‌గా నిలువడం ఇది ఐదోసారి. భారత్‌ 2000, 2008, 2012, 2018 లలోనూ విజేతగా నిలిచింది.

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అండర్ 19 ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన యువ భారత జట్టుకు ప్రధానిమోదీ(PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. టోర్నీ మొదలైనప్పటి నుంచి చివరి వరకు యువ ఆటగాళ్లు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. ‘వారు టోర్నమెంట్‌ మొత్తం గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. భారత క్రికెట్ సురక్షితమైన, సమర్థవంతమైన చేతుల్లో ఉందనడానికి యువ క్రికెటర్ల అద్భుత ప్రదర్శనే నిదర్శనం’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

అటు యువ భారత్‌ కు బీసీసీఐ (BCCI) కూడా భారీ నజరానా ప్రకటించింది. అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త యువ జ‌ట్టును బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషా (Jay shah) అభినందించారు. అధ్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో భార‌త విజ‌యంలో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క ఆట‌గాడికి రూ. 40 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని బీసీసీఐ ప్ర‌క‌టించింది. సహాయక సిబ్బందిలోని ప్రతి సభ్యుడికి 25 లక్షల క్యాష్ ఫ్రైజ్‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు జైషా తెలిపారు.

అటు యువ భారత్‌ కు పలువురు క్రీడాకారులు అభినందనలు తెలిపారు. ఫైనల్‌ లో కుర్రాళ్లు అదరగొట్టారని, వారి పర్మామెన్స్ అదిరిపోయిందని నెటిజన్లు కూడా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.