IND vs NZ: న్యూజీలాండ్-భారత్ మూడో టీ20 మ్యాచ్ టై, 1-0 తేడాతో సీరిస్ కైవసం చేసుకున్న టీమిండియా

భారత ఇన్నింగ్స్‌ సమయంలో (9 ఓవర్ల తర్వాత 75/4) వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం టైగా ప్రకటించారు.

Mohammed Siraj (Photo credit: Twitter)

నేపియర్‌లోని మెక్లీన్‌ పార్క్‌ వేదికగా నూజిలాండ్‌తో నేడు (నవంబర్‌ 23) జరిగిన మూడో టీ20 టైగా ముగిసింది. భారత ఇన్నింగ్స్‌ సమయంలో (9 ఓవర్ల తర్వాత 75/4) వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం టైగా ప్రకటించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సమయానికి టీమిండియా స్కోర్‌ 9 ఓవర్ల తర్వాత 75/4గా ఉంది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 9 ఓవర్ల తర్వాత టీమిండియా గెలిచి ఉండాలంటే 76 పరుగులు చేసి ఉండాలి. అయితే ఈ సమయానికి స్కోర్లు సమంగా (9 ఓవర్ల తర్వాత 75) ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం టైగా నిర్ధారించారు. క్రికెట్‌ చరిత్రలో ఇలా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం మ్యాచ్‌లు టైగా ముగిసిన సందర్భాలు ఈ మ్యాచ్‌తో కలిపి మూడు ఉన్నాయి.

రికార్డులు బద్దలు, 50 ఓవర్లలో 506/2 స్కోర్ చేసిన తమిళనాడు టీం, విజయ్ హజారే ట్రోఫీ 2022లో ఓపెనింగ్ వికెట్‌కు 416 పరుగులు నమోదు చేసిన బ్యాటర్లు

2021లో నెదర్లాండ్స్‌-మలేషియా మధ్య జరిగిన మ్యాచ్‌, 2021లో మాల్టా-జిబ్రాల్టర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలాగే డక్‌వర్త్‌ లూయిస్‌ టైగా ముగిశాయి.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ భారత్ కు 161 పరుగుల లక్ష్యాన్ని విసిరింది.డెవాన్‌ కాన్వే (59), గ్లెన్‌ ఫిలిప్స్‌ (54) కీవీస్ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ (4/17), అర్షదీప్‌ సింగ్‌ (4/37) వికెట్లు తీసారు. 161 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. కివీస్‌ పేసర్లు సౌథీ (2/27), ఆడమ్‌ మిల్నే (1/23), సోధి (1/12) ధాటికి 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ను (10) మిల్నే ఔట్‌ చేయగా.. మరో ఓపెనర్‌ రిషబ్‌ పంత్‌ (11), శ్రేయస్‌ అయ్యర్‌ (0)లను సౌథీ, సూర్యకుమార్‌ను (13) సోధి పెవిలియన్‌కు పంపారు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 75/4 వద్ద ఉండగా వర్షం మొదలైంది.దీపక్‌ హుడా (9), హార్ధిక్‌ పాండ్యా (30) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్‌ను టైగా ప్రకటించారు.