IND vs PAK Stat Highlights: టీ20 ప్రపంచకప్‌ను ఓటమితో ఆరంభించిన కోహ్లీ‌సేన, వికెట్ పడకుండానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకున్న పాక్, ప్రపంచకప్‌ చరిత్రలో దాయాది దేశానికి భారత్‌పై 10 వికెట్ల తేడాతో తొలి విజయం

తొలి పోరు పాకిస్థాన్‌తో కావడంతో (IND vs PAK Stat Highlights) ఈ మ్యాచ్‌కు ఎక్కడలేని క్రేజ్‌ ఏర్పడింది. ఆ అంచనాలను కోహ్లీ సేన ఏమాత్రం అందుకోలేకపోయింది. అటు ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఎదురైన ఐదు ఓటములకు పాక్‌ పది వికెట్ల తేడాతో గెలిచి (Pakistan Register First Win Over India At Twenty-20 WC) ప్రతీకారం తీర్చుకుంది.

Shaheen Afridi (Photo Credits: Twitter/Pakistan Cricket)

టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. తొలి పోరు పాకిస్థాన్‌తో కావడంతో (IND vs PAK Stat Highlights) ఈ మ్యాచ్‌కు ఎక్కడలేని క్రేజ్‌ ఏర్పడింది. ఆ అంచనాలను కోహ్లీ సేన ఏమాత్రం అందుకోలేకపోయింది. అటు ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఎదురైన ఐదు ఓటములకు పాక్‌ పది వికెట్ల తేడాతో గెలిచి (Pakistan Register First Win Over India At Twenty-20 WC) ప్రతీకారం తీర్చుకుంది. ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్తాన్‌ జట్టుకు భారత్‌ పై ఇది తొలి విజయం. గతంలో వన్డే, టి20 ఫార్మాట్‌లలో కలిపి 12 సార్లు తలపడితే ప్రతీసారి ఓడిన పాక్‌ ఇప్పుడు ఆ లెక్కను (Pakistan Register First Win ) మార్చింది. ఆదివారం జరిగిన పోరులో భారత్‌ను 10 వికెట్లతో చిత్తు చేసి వరల్డ్‌ కప్‌లో శుభారంభం చేసింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 నాటౌట్‌), బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 నాటౌట్‌) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించారు. భారత్ తరపున కోహ్లీ (49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 57), పంత్‌ (30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) మాత్రమే మెరుగ్గా రాణించారు. షహీన్‌కు మూడు, హసన్‌ అలీకి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పాక్‌ 17.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షహీన్‌ షా అఫ్రీది నిలిచాడు.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో విజయంతో ప్రస్థానం ప్రారంభించిన ఐర్లాండ్, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపు

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్స్‌ను పాక్‌ బౌలర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఆరంభంలోనే యువ పేసర్‌ షహీన్‌ షా అఫ్రీది తన ఇన్‌స్వింగర్లు, యార్కర్లతో వణికించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే రోహిత్‌ను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఇక తన మరుసటి ఓవర్‌లో రాహుల్‌ (3)ను ఓ అద్భుత డెలివరీతో బౌల్డ్‌ చేశాడు. బ్యాట్‌, ప్యాడ్‌ మధ్యలోంచి వెళ్లిన ఆ బంతిని రాహుల్‌ ఆడలేకపోయాడు. అప్పటికి స్కోరు కేవలం 6 పరుగులు మాత్రమే. ఇలాంటి స్థితిలో సూర్యకుమార్‌ (11) వరుస ఓవర్లలో ఓ సిక్సర్‌, ఓ ఫోర్‌తో ఆశాజనకంగా కనిపించాడు. కానీ అతడి దూకుడు కూడా ఆరో ఓవర్‌లోనే ముగిసింది. దీంతో పవర్‌ప్లేలోనే జట్టు 36/3తో ఉసూరుమనిపించింది.

పంత్‌ రాకతో..: ఓవైపు వికెట్లు పడుతుండడంతో మరో ఎండ్‌లో కెప్టెన్‌ కోహ్లీ రక్షణాత్మకంగా ఆడాడు. అయితే రిషభ్‌ పంత్‌ రాకతో సీన్‌ మారింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా అతడు పాక్‌ బౌలర్లను ఎదుర్కోవడంతో పరుగులు కూడా అదే వేగంతో వచ్చాయి. 12వ ఓవర్‌లో అతడు ఒంటి చేత్తో బాదిన రెండు వరుస సిక్సర్లు అద్భుతమనిపించాయి. ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. కానీ అంతా సవ్యంగా సాగుతుందనుకున్న దశలో 13వ ఓవర్‌లో స్పిన్నర్‌ షాదాబ్‌ గూగ్లీకి పంత్‌ రిటర్న్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. దీంతో నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

ఈ దశలో కోహ్లీ, జడేజా (13) కూడా భారీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్‌పై దృష్టి సారించారు. 16వ ఓవర్‌లో కోహ్లీ రెండు ఫోర్లతో స్కోరులో కాస్త కదలిక వచ్చింది. అలాగే 18వ ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో అతడు అర్ధసెంచరీని పూర్తి చేశాడు. కానీ ఇదే ఓవర్‌లో జడేజా వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక 19వ ఓవర్‌లో షహీన్‌.. కోహ్లీని అవుట్‌ చేసినా.. పాండ్యా రెండు ఫోర్లతో పాటు ఓవర్‌త్రోతో ఐదు పరుగులు రావడంతో 17 రన్స్‌ జత చేరాయి. కానీ చివరి ఓవర్‌లో హార్దిక్‌ వికెట్‌తో పాటు ఏడు పరుగులే రావడంతో భారీ స్కోరు దక్కలేదు.

సాధారణ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ జట్టుకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ఓపెనింగ్‌ భాగస్వాములుగా మంచి రికార్డు ఉన్న రిజ్వాన్, బాబర్‌ దానిని ఇక్కడా కొనసాగించారు. ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రశాంతంగా ఆడి పని పూర్తి చేశారు. ఏ దశలోనూ భారత బౌలర్లు పాక్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. భువీ వేసిన తొలి ఓవర్లో పది పరుగులతో మొదలు పెట్టిన పాక్‌ పవర్‌ప్లేలో 43 పరుగులు చేసింది. సగం ఇన్నింగ్స్‌ ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. ఆ తర్వాత మరింత దూకుడు ప్రదర్శించిన వీరిద్దరు వేగంగా లక్ష్యం దిశగా జట్టును నడిపించారు.

ఈ క్రమంలో బాబర్‌ 40 బంతుల్లో, రిజ్వాన్‌ 41 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 12.5 ఓవర్లకు స్కోరు 100 పరుగులకు చేరిన తర్వాత పాక్‌ గెలుపు లాంఛనమే అయింది. భారత బౌలర్లలో షమీ బాగా నిరాశపర్చగా... అంచనాలు పెట్టుకున్న మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి వాటిని అందుకోలేకపోయాడు. వరుణ్‌ తొలి 3 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి పొదుపుగా బౌలింగ్‌ చేసినా, వికెట్‌ తీయడంలో మాత్రం విఫలమయ్యాడు. మంచు ప్రభావం కొంత వరకు ఉన్నా, భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

స్కోర్ బోర్డ్

భారత్‌:

రాహుల్‌ (బి) షహీన్‌ 3; రోహిత్‌ (ఎల్బీ) షహీన్‌ 0; కోహ్లీ (సి) రిజ్వాన్‌ (బి) షహీన్‌ 57; సూర్యకుమార్‌ (సి) రిజ్వాన్‌ (బి) హసన్‌ 11; పంత్‌ (సి అండ్‌ బి) షాదాబ్‌ 39; జడేజా (సి సబ్‌) నవాజ్‌ (బి) హసన్‌ 13; హార్దిక్‌ (సి) బాబర్‌ (బి) రౌఫ్‌ 11; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 5; షమి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 151/7. వికెట్ల పతనం: 1-1, 2-6, 3-31, 4-84, 5-125, 6-133, 7-146. బౌలింగ్‌: షహీన్‌ షా అఫ్రీది 4-0-31-3; ఇమాద్‌ వసీం 2-0-10-0; హసన్‌ అలీ 4-0-44-2; షాదాబ్‌ ఖాన్‌ 4-0-22-1; మహ్మద్‌ హఫీజ్‌ 2-0-12-0; రౌఫ్‌ 4-0-25-1.

పాకిస్థాన్‌:

రిజ్వాన్‌ (నాటౌట్‌) 79; బాబర్‌ ఆజమ్‌ (నాటౌట్‌) 68; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 17.5 ఓవర్లలో 152/0. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-25-0, షమి 3.5-0-43-0, బుమ్రా 3-0-22-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-33-0, రవీంద్ర జడేజా 4-0-28-0.

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చేతిలో తొలి ఓటమిని కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘మన ఆటగాళ్లు డబ్బు ఎక్కువైన ‘స్టార్స్‌’లా ఆడితే... పాకిస్తాన్‌ ప్లేయర్లు ఆకలి మీదున్న అండర్‌డాగ్స్‌లా ఆడారు. ఇదే తేడా. మీరేం చేశారో మీకు అర్థమవుతుందా అయ్యా’’ అంటూ కోహ్లి సేన ఆట తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతేకాదు... ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ను తుది జట్టులో ఆడించకుండా మేనేజ్‌మెంట్‌ చేసిన తప్పునకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని మండిపడుతున్నారు.

హార్దిక్‌ పాండ్యా గల్లీ క్రికెట్‌ స్థాయిలో కూడా ఆడలేకపోయాడని.. పాండ్యా, రోహిత్‌ శర్మ తీవ్ర నిరాశకు గురిచేశారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు. అయితే.. మరికొందరు మాత్రం గెలుపోటములు సహజమని... ఇప్పుడే టోర్నీ ముగిసిపోలేదంటూ టీమిండియాకు అండగా నిలుస్తున్నారు. అయినా, ఈరోజు(ఆదివారం) గెలిచింది పాక్‌ జట్టు కాదు.. ఆట(క్రికెట్‌) అంటూ కామెంట్లు చేస్తున్నారు.