India vs West Indies 3rd T20I: భారత్ మరియు వెస్టిండీస్ మధ్య ముంబై వేదికగా నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్

ఇటు మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్న శివం దుబే రెండో టీ20లో అదరగొట్టాడు.....

The three-match T20I series between Ind and WI is currently tied at 1-1. | (Photo Credits: IANS)

ఇండియా మరియు వెస్టిండీస్ (India vs West Indies) జట్ల మధ్య నిర్ణయాత్మక మూడవ మరియు చివరి టీ20 మ్యాచ్ బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరవిహారంతో హైదరాబాద్ మ్యాచ్ లో గెలిచిన భారత్, ఆ తర్వాత రెండో టీ20లో మాత్రం చెత్త ఫీల్డింగ్ కారణంగా పరాజయం పాలైంది. దీంతో ఈ సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ లో గెలిచిన జట్టు, సిరీస్ తమ ఖాతాలో వేసుకుంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం.

వాంఖడే మైదానంలో మంచు బిందువులు కురిసే అవకాశం ఉంది. అది బౌలింగ్‌కు అనుకూలించే అంశం కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకొని లక్ష్యాన్ని ఛేదించటానికే మొగ్గు చూపుతాయని పిచ్ క్యూరేటర్లు చెబుతున్నారు.

అన్నట్లుగానే టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట భారత్ బ్యాటింగ్ ప్రారంభిస్తుంది.

అయితే బ్యాటింగ్‌కు కూడా పిచ్ చాలా బాగా అనుకూలిస్తుంది. కాబట్టి భారీ స్కోర్లు ఖాయమే అని చెబుతున్నారు.

ముంబై లోకల్ బోయ్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సూపర్ హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న శివం దుబే రెండో టీ20లో అదరగొట్టాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పట్లాగే మంచి ఫామ్‌లో ఉన్నాడు. వీరు ముగ్గురూ విజృంభిస్తే భారీ స్కోరు ఖాయమే, ఎటొచ్చి ఫీల్డింగ్‌లో భారత్ మెరుగుపడిందో లేదో చూడాలి.

ఇక జట్ల విషయానికి వస్తే...

ఇండియా టీ20 స్క్వాడ్: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (సి), రిషబ్ పంత్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివం దుబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండే యాదవ్, మహ్మద్ షమీ.

వెస్టిండీస్ టీ20 స్క్వాడ్: లెండ్ల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, షిమ్రాన్ హెట్మియర్, నికోలస్ పూరన్ (కీపర్), కీరోన్ పొలార్డ్ (సి), జాసన్ హోల్డర్, ఖారీ పియరీ, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, కేస్రిక్ విలియమ్స్, కీమో పాల్, డెనేష్ రామ్‌డిన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్.