NZ vs Ind 1st T20: తొలి టీ20లో భారత్ ఘన విజయం, 204 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించిన టీమిండియా, సిరీస్‌లో 1-0 తో ముందంజ
న్యూజిలాండ్ నిర్ధేషించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం సునాయాసంగా 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది....
Auckland: న్యూజిలాండ్ సొంత గడ్డపై భారత్ (India) బోణి కొట్టింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని విజయంతో ప్రారంభించింది. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ (NZ vs Ind 1st T20) లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ (New Zealand) నిర్ధేషించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం సునాయాసంగా 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తో ముందంజలో ఉంది.
204 పరుగుల భారీలక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. భారత్ స్కోర్ బోర్డ్ 16 వద్ద ఉన్నప్పుడు రోహిత్ శర్మ 7 పరుగులకే ఔట్ అయ్యాడు. అయినప్పటికీ మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ (KL Rahul) మాత్రం నిలకడగా, దూకుడుగా ఆడుతూ కెప్టెన్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రాహుల్ 27 బంతుల్లో 56, కోహ్లీ 32 బంతుల్లో 45 పరుగులు చేశారు. నాలుగో వికెట్‌గా వచ్చిన శ్రేయాస్ ఐయర్ (Shreyas Iyer) మెరుపులు మెరిపిస్తూ 29 బంతుల్లో 58 పరుగులు నాటౌట్, సిక్సర్‌తో విన్నింగ్ షాట్ కొట్టి, తొలి విజయాన్ని భారత్ ఖాతాలో వేశాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డ్ కూడా శ్రేయాస్ ఐయర్‌కే దక్కింది. టీమిండియా బిజీ షెడ్యూల్, ఫిబ్రవరి నెలంతా న్యూజిలాండ్ లోనే!
భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహం 12:30 గంటలకు ప్రారంభం కాగా, టాస్ గెలిచిన కోహ్లీసేన బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఒపెనర్లు ఇద్దరు మార్టిన్ గప్తిల్ (30), కోలిన్ మున్రో (59) కలిసి తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా 26 బంతుల్లోనే 51 పరుగులతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రాస్ టేలర్ కూడా వేగంగా ఆడి 27 బంతుల్లో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా 20 ఓవర్లలో న్యూజిలాండ్ 203-5 స్కోర్ చేసింది.