Auckland: ఈ ఏడాదిలో జరగే టీ-20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా నేటి నుంచి న్యూజిలాండ్‌తో (Nz vs Ind) జరిగే 5 మ్యాచ్‌ల టీ 20 అంతర్జాతీయ సిరీస్‌లో పాల్గొంటుంది. ఆక్లాండ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ మధ్యాహం 12:30 గంటలకు ప్రారంభమైంది. టాస్ గెలిచిన కోహ్లీసేన బౌలింగ్ ఎంచుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఒపెనర్లు ఇద్దరు మార్టిన్ గప్తిల్ (30), కోలిన్ మున్రో (59) కలిసి తొలి వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా 26 బంతుల్లోనే 51 పరుగులతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రాస్ టేలర్ కూడా వేగంగా ఆడి 27 బంతుల్లో 54 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఫలితంగా 20 ఓవర్లలో న్యూజిలాండ్ 203-5 స్కోర్ చేసింది. భారత్ బ్యాటింగ్ ప్రారంభమైంది. Live Score commentary - లైవ్ స్కోర్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మరియు శివం దుబేలకు చెరో వికెట్ పడగొట్టినా ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఇందులో బుమ్రా ఒక్కడే 4 ఓవర్లు వేసి 31 పరుగులు, 7.75 రన్ రేట్ తో 1 వికెట్ తీసి పరవాలేదనిపించాడు.
భారత జట్టులో రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ (Lokesh Rahul కీపర్), విరాట్ కోహ్లీ (సి), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, శివం దుబే, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా ఆడుతున్నారు.
టీమిండియా బిజీ షెడ్యూల్, ఫిబ్రవరి నెలంతా న్యూజిలాండ్ లోనే!
మాతృదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఐదు రోజుల్లోనే భారత జట్టు న్యూజిలాండ్ జట్టుతో న్యూజిలాండ్‌లో ఆట ప్రారంభించింది. ఆదివారం రాత్రి ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన మర్నాడే ఆక్లాండ్ చేరుకున్న కోహ్లీసేన కేవలం 2 రోజుల విశ్రాంతితోనే తమ తొలి టీ20 మ్యాచ్ ఆరంభించింది. ప్రపంచకప్ కోసం ఇప్పట్నించే ఆటగాళ్ల ఎంపికపై కన్నేసిన సెలెక్టర్లు, జట్టులో ప్రయోగాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ద్వారా ఎక్కువ మంది ఆడటానికి జట్టులో అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఫిబ్రవరి నెల మొత్తం టీమిండియా న్యూజిలాండ్ లోనే గడపనుంది. ఇక్కడ 5 టీ20లు ముగిసిన తర్వాత, ఇరు జట్లు 3 వన్డే మ్యాచ్‌లు మరియు 2 టెస్ట్ మ్యాచ్‌లలో తలపడనున్నాయి. మళ్లీ మార్చిలో తిరిగి భారత్ చేరుకొని సౌతాఫ్రికాతో 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇది అయిపోగానే ఐపీఎల్ ప్రారంభమవుతుంది.