Ind vs SL 2nd T20: శ్రీలంకపై భారత్ ఘనవిజయం, రెండో టీ20లో ఆతిత్య జట్టు నిర్ధేషించిన స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమిండియా, రానున్న టీ20 ప్రపంచ కప్ పైనే గురి!
ఆ మెగా టోర్నమెంట్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సన్నాహకాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఇరు జట్లకు మరియు ఆటగాళ్లకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది.....
Indore: భారత్ - శ్రీలంకల (India - Sri Lanka) మధ్య ఇండోర్ వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కుశల పెరెరా 34 పరుగులతో ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్ శార్దూల్ ఠాకూర్‌కి 3 వికెట్లు దక్కాయి.
అనంతరం ఛేజింగ్ కు దిగిన భారత్‌కు ఒపెనర్లు లోకేశ్ రాహుల్ 45, శిఖర్ ధవన్ 32 పరుగులతో అద్భుత ఆరంభాన్నిచ్చారు. మిగతా పని శ్రేయాస్ అయ్యర్ 34, విరాట్ కోహ్లీ 30 నాటౌట్ పూర్తి చేశారు. 17.3 ఓవర్లలో 144 పరుగులు చేసి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. కీలక సమయాల్లో 2 వికెట్లు తీసి, 4 ఓవర్లలో 18 పరుగులే ఇచ్చిన భారత బౌలర్ నవదీప్ సైనీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డ్ దక్కింది
స్కోర్ బోర్డ్, మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం - ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు
మూడు టీ20ల సిరీస్‌లో వర్షం కారణంగా గువహటి వేదికగా జరగాల్సిన తొలి టీ20 రద్దయింది. ఈ నేపథ్యంలో సిరీస్ నెగ్గాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లను తప్పక నెగ్గాల్సి ఉంటుంది.
ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనున్నందున్న జట్టులో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఆ మెగా టోర్నమెంట్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సన్నాహకాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఇరు జట్లకు మరియు ఆటగాళ్లకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. మెగాటోర్నీ కోసం టీమిండియాలో జట్టు కూర్పు కోసం సెలక్టర్లు దృష్టి పెట్టారు. ఓపెనర్లుగా రోహిత్‌కు జోడిగా కేఎల్ రాహుల్ మరియు శిఖర్ ధవన్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. తొలి టీ20 వర్షంతో రద్దు కావడంతో ఆడకుండానే శిఖర్ ఒక అవకాశాన్ని కోల్పోయాడు. గతేడాది 12 టీ20 మ్యాచ్ లు ఆడిన శిఖర్ 110 స్ట్రైక్ రేటుతో 272 పరుగులు చేశాడు. ఇటు కేఎల్ రాహుల్ కూడా విజృంభించి ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సెలెక్టర్లకు కష్టంగా మారింది. జరుగుతున్న మ్యాచ్‌లలో బాగా ఆడేవారికే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కనుంది.