Delhi Capitals Beat Lucknow Super Giants:లక్నో జైత్రయాత్రకు బ్రేక్ వేసిన ఢిల్లీ, రిషబ్ పంత్ మెరుపులు, కుల్దీప్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ తో 6 వికెట్ల తేడాతో ఘన విజయం
మెగా టోర్నీలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)పై జయభేరి మోగించింది.
New Delhi, April 12: ఐపీఎల్ పదిహేడో సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) రెండో విజయం సాధించింది. మెగా టోర్నీలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)పై జయభేరి మోగించింది. యువ ఆల్‌రౌండర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(55) అర్ధ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ రిషభ్ పంత్(41) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో స్టబ్స్(15 నాఔట్), షై హోప్(11 నాటౌట్)లు ఆడుతూ పాడుతూ లాంఛనం ముగించారు. దాంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ ఓటమి తప్పించుకుంది. పంత్ సేన పంచ్‌తో లక్నో జైత్రయాత్రకు బ్రేక్ పడింది. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో 160కి పైగా స్కోర్లను 13సార్లు కాపాడుకున్న లక్నోకు ఇది మింగుడుపడని ఓటమే. పదహారో సీజన్‌లో మాదిరిగా పరాజయాల పరంపర కొనసాగించిన ఢిల్లీ.. కీలక పోరులో జూలు విదిల్చింది. తొలుత బౌలర్లు కుల్దీప్ యాదవ్(20/3), ఖలీల్ అహ్మద్(41/2)ల విజృంభణతో లక్నోను 167 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఓపెనర్లు పృథ్వీ షా(32), డేవిడ్ వార్నర్(8)లు స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు.
అక్కడితో రిషభ్ పంత్(41), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(55)లు లక్నో స్పిన్నర్లపై దాడికి దిగారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 77 రన్స్ చేసి ఢిల్లీని గెలుపు బాట పట్టించింది. ఈ క్రమంలోనే పంత్ ఐపీఎల్‌లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ విజయానికి 22 పరుగులు అవసరమైన సమయంలో పంత్ ఔట్ కాగా.. ట్రిస్టన్ స్టబ్స్(15 నాటౌట్), షాయ్ హోప్(11 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ సొంత మైదానంలో తడబడింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ క్వింటన్ డికాక్(19), దేవ్‌దత్ పడిక్కల్(3)లను ఖలీల్ అహ్మద్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత బంతి అందుకున్న కుల్దీప్ యాదవ్.. మార్కస్ స్టోయినిస్(8), నికోలస్ పూరన్(0) వంటి హిట్లర్లను డగౌట్‌కు చేర్చాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(39)ను ఔట్ చేసి లక్నోను మరింత కష్టాల్లోకి నెట్టాడు. 94 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన జట్టును యువకెరటం ఆయుష్ బదొని(55 నాటౌట్) ఆదుకున్నాడు. టెయిలెండర్ అర్షద్ ఖాన్(20 నాటౌట్)తో కలిసి 8వ వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరూ 73 పరుగులు జోడించడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 రన్స్ కొట్టింది.