T20 World Cup 2022: శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసిన స్టొయినిస్‌, కేవలం 17 బంతుల్లోనే అర్థ సెంచరీ, 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించిన ఆసీస్

మార్కస్‌ స్టొయినిస్‌ రాకెట్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. స్టొయినిస్‌ కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదాడు.

Marcus Stoinis (Photo-Twitter)

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా శ్రీలంకతో నేడు జరిగిన సూపర్‌-12 గ్రూప్‌-1 మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మార్కస్‌ స్టొయినిస్‌ రాకెట్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. స్టొయినిస్‌ కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదాడు. లంక నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్టొయినిస్‌ మెరుపు హాఫ్‌ సెంచరీతో (18 బంతుల్లో 59 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) లంక బౌలర్లను చీల్చిచెండాడు. ఫలితంగా ఆసీస్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.లంక బ్యాటర్లలో పథుమ్‌ నిస్సంక (45 బంతుల్లో 40; 2 ఫోర్లు), అసలంక (25 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వా (23 బంతుల్లో 26; 3 ఫోర్లు), చమిక కరుణరత్నే (7 బంతుల్లో 14 నాటౌట్‌; 2 ఫోర్లు) రాణించారు.

ఎప్పటిలాగే ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను వెంటాడిన దురదృష్టం, డికాక్‌ చేసిన పొరపాటుతో ప్రత్యర్థికి 5 పెనాల్టీ పరుగులతో పాటు అదనంగా బంతి

అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. ఆరంభంలోనే డేవిడ్‌ వార్నర్‌ (11), మిచెల్‌ మార్ష్‌ (17) వికెట్లు కోల్పోయి తడబడినప్పటికీ.. కెప్టెన్‌ ఫించ్‌ (42 బంతుల్లో 31 నాటౌట్‌; సిక్స్‌), మ్యాక్స్‌వెల్‌ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 13 ఓవర్‌లో మ్యాక్సీ ఔట్‌ కావడంతో బరిలోకి దిగిన స్టొయినిస్‌ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్‌ 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.