India vs Bangladesh, 1st Test 2019: ముగిసిన రెండో రోజు ఆట, మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ, భారీ ఆధిక్యం దిశగా భారత్, ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 493/6
అయితే, శనివారం మూడో రోజు ఆట ప్రారంభం...
Indore, November 15: భారత్ మరియు బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్, ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి బ్యాట్ తోనూ సత్తా చాటింది. భారత ఒపెనింగ్ బ్యాట్స్ మెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) చెలరేగి ఆడాడు. 28 ఫోర్లు, 8 సిక్సర్లతో 243 పరుగులు చేసి కెరియర్ లో రెండో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అజింక్యా రహానే 86, ఛతేశ్వర్ పూజారా 54, రవీంద్ర జడేజా 60* కూడా రాణించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 493 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 343 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 60 పరుగులతో, మరియు 25 పరుగులతో నాటౌట్ గా క్రీజులో నిలిచారు.
ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 6 పరుగులకే వెనుదిరగగా, కెప్టెన్ కోహ్లీ డకౌట్ అయి నిరాశ పరిచాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
బంగ్లా బౌలర్లలో అబు జయేద్ ఒక్కడే 4 వికెట్లు తీయగా, ఇబాదత్ హొస్సేన్ మరియు మెహ్దీ హోసన్ తలో వికెట్ తీసుకున్నారు.
భారత్ చేతిలో ఇంకా రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ వికెట్లు ఉన్నాయి. అయితే, శనివారం మూడో రోజు ఆట ప్రారంభం అయిన తర్వాత ప్రస్తుతం క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా ఔట్ అయితే, కెప్టెన్ కోహ్లీ భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది.