Cricketers Biopic Movies: వీరు ఆన్ గ్రౌండ్ లోనే కాదు, ఆన్ స్క్రీన్ మీద కూడా సూపర్ హిట్. ఇప్పటివరకు ఏయే క్రికెటర్స్ పై బయోపిక్స్ వచ్చాయో తెలుసా?

ఎందుకంటే..

Biopic movies made on Indian cricketers.

Sports Biopic Movies- మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే చూడాలనిపిస్తుంది, అలాగే మన ఫేవరెట్ క్రికెటర్ బ్యాటింగ్ చేస్తే చూడాలనిపిస్తుంది. ఈరోజు ఎంత స్కోర్ చేస్తాడు, ఎంత మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు అనే క్యూరియాసిటి ఉంటుంది. నిజానికి సినిమా హీరోల మీద ఉన్న అభిమానం కంటే ఒక క్రికెటర్ లేదా ఒక క్రీడాకారుడు (Sports person) మీద ఉన్న అభిమానం ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. ఎందుకంటే ఒక ఆటగాడు కఠోర శ్రమకు ఓర్చి జట్టులో చోటు సంపాదించి ఓ మంచి క్రీడాకారుడిగా ఎదగడం ఒక విజయమైతే, అతడు తన దేశ జట్టు విజయం కోసం చూపించే పోరాటపటిమ ఎంతో స్పూర్థిని కలిగిస్తుంది.

అలాంటి క్రీడాకారుల జీవిత చరిత్రలు సినిమాలు (Biopics) గా రావటం చాలా మంచి పరిణామమే. అయితే బాలీవుడ్ మాత్రమే ఇప్పటివరకు ఇలాంటి బయోపిక్స్ ను అందించింది.  భారత్ కు ఖ్యాతి తీసుకొచ్చి పెట్టిన కొంతమంది క్రీడాకారుల జీవిత విశేషాలు తెలుపుతూ బాలీవుడ్ లో ఇప్పటివరకు దంగల్, పాన్ సింగ్ తోమర్, మేరీకోమ్, భాగ్ మిల్ఖా భాగ్, బుధియా సింగ్, సూర్మ లాంటి సినిమాలు  రిలీజ్ అయ్యాయి. మరికొందరి బయోపిక్స్ కూడా రెడీ అవుతున్నాయి.

ఇక క్రికెటర్ల విషయానికి వస్తే ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అజరుద్దీన్ లపై బయోపిక్స్ వచ్చాయి.

M.S. Dhoni: The Untold Story: భారత క్రికెట్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

క్రికెటర్ అవ్వాలనుకునే ఒక యువకుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలతో తప్పనిసరి పరిస్థితిలో రైల్వేలో ఓ చిన్న ఉద్యోగం చేస్తాడు. కానీ క్రికెటర్ అవ్వాలనే బలమైన కోరిక అతణ్ని ఆ ఉద్యోగానికి రాజీనామా చేయిస్తుంది. చివరి ప్రయత్నంగా క్రికెటర్ అయ్యేందుకు తన అదృష్టం పరీక్షించుకుంటాడు. చివరికి జట్టులో చోటు సంపాదించి, ఓ స్టార్ క్రికెటర్ గా, భారత జట్టు కెప్టెన్ గా ఎదిగి భారత్ కు ఎన్నో అద్వితీయమైన విజయాలందించటంతో పాటు 28 ఏళ్ళ తర్వాత భారత్ కు ప్రపంచకప్ ను సైతం అందిస్తాడు. ఇక్కడివరకూ ఈ కథ ఉంటుంది, ఈ కథ సాగే తీరు, క్రికెటర్ అవ్వడానికి ధోని పడిన కష్టాలు, సాధించిన విజయాలు, మధ్యలో తను ప్రేమించిన వ్యక్తి చనిపోవడం, కెప్టెన్ కూల్ గా పేరున్న ధోనీ కూడా బాధతో ఏడ్చిన సందర్భాలు చూస్తే ధోనీపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని మరింత పెంచుతాయి.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 216 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

Sachin: A Billion Dreams- మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ఎవరికి తెలియనిది కాదు, ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం.

సచిన్ జీవితచరిత్ర విశేషాలను తెలుపుతూ తెరకెక్కిన ఈ సినిమా చిన్నప్పుడు సచిన్ బ్యాట్ పట్టుకున్న క్షణాల నుంచి క్రికెట్ దేవుడు (God of Cricket) గా అవతిరించిన తీరును కళ్లకు కడుతుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 78.86 కోట్ల వసూళ్లను రాబట్టింది.

Azhar - భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ స్టైలిష్ ప్లేయర్ అయిన మహమ్మద్ అజరుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ సినిమా ముఖ్యంగా అజర్ తన క్రికెట్, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు ఘటనలపై  ఫోకస్ చేసింది.

తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తనను ఎంత ఒత్తిడికి గురిచేశాయి, అలాగే జీవిత భాగస్వామి నుంచి విడిపోవడం. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని అజర్ చేసే న్యాయ పోరాటం, వైఫల్యాలను తట్టుకొని మనిషిగా నిలదొక్కుకున్న వైనం తదితర అంశాలతో ఈ కథ సాగుతుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 56.8 కోట్లు కలెక్ట్ చేసింది.