ODI World Cup 2023: మెగా క్రికెట్ సమరానికి సర్వం సిద్ధం, నేటి నుంచి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభం, తొలి మ్యాచ్‌ ఆడనున్న ఇంగ్లాండ్- న్యూజిలాండ్, వన్డే వరల్డ్ కప్ విశేషాలివే!

మధ్యాహ్నం 2గంటల నుంచి అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ప్రారంభమవుతోంది. నవంబర్ 19న ఇదే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు.

ODI World Cup 2023 (PIC@ ICC Twitter)

New Delhi, OCT 05: భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ కు (ICC World Cup) రంగం సిద్ధమైంది. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమరానికి సమయం ఆసన్నమైంది. మెగా ఈవెంట్ లో 10 జట్లు వార్ కు సిద్ధమయ్యాయి. దేశంలోని పది క్రికెట్ స్టేడియంలలో 46 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ – న్యూజిలాండ్ (ENG Vs NZ) జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2గంటల నుంచి అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ప్రారంభమవుతోంది. నవంబర్ 19న ఇదే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. టోర్నీలో టీమిండియా (Team India) తొలి మ్యాచ్ ను అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నై వేధికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తలపడుతుంది. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.

 

భారత గడ్డపై జరగుతున్న మెగా టోర్నీలో (ODI World Cup 2023) మ్యాచ్ లు మొత్తం 10 నగరాల్లోని వేదికల్లో జరగనున్నాయి. వీటిలో.. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, లక్నో, ధర్మశాల, ఫుణే, హైదరాబాద్ ఉన్నాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ లో మినహా మిగతా తొమ్మిది నగరాల్లోని స్టేడియంలలో భారత్ తమ మ్యాచ్ లు ఆడుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో రెండు మ్యాచ్ లు పాకిస్థాన్ జట్టు ఆడేవే.

 

పన్నెండు సార్లు వరల్డ్ కప్ జరగ్గా. ఐదు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్, వెస్టిండీస్ జట్లు రెండుసార్లు విజేతలుగా నిలిచాయి. పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఒక్కోసారి వరల్డ్ కప్ ట్రోపీని గెలుచుకున్నాయి.

భారత్ వన్డే వరల్డ్ కప్ కు ఆతిధ్యం ఇవ్వడం ఇది నాల్గోసారి. గతంలో 1987, 1996, 2011లలో ఇక్కడ వరల్డ్ కప్ జరిగింది. అయితే.. భారత్ తొలిసారిగా ఈ టోర్నీని పూర్తిస్థాయిలో నిర్వహిస్తోంది. 1987లో పాక్ తో, 1996లో శ్రీలంకతో, 2011లో శ్రీలంక, బంగ్లాదేశ్ తో కలిసి సంయుక్తంగా ఈ టోర్నీకి భారత్ అతిథ్యం ఇచ్చింది.

ఈ మెగా టోర్నీ మొత్తం ఫ్రైజ్ మనీ రూ. 83కోట్లు. ఇందులో విజేతకు రూ. 33కోట్లు కాగా, రన్నరప్ కు రూ. 16.50 కోట్లు అందిస్తారు.

గత వరల్డ్ కప్ లోనూ ఈసారి జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఏకైక ఆటగాడు కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) మాత్రమే. మిగతా అన్ని జట్ల క్రికెటర్లకు సారథులు మారారు.

ఈ ప్రపంచ కప్ లో ఆడబోతున్న అతిపిన్న వయస్సు ఆటగాడు ఆఫ్గానిస్థాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్. అతని వయస్సు గురువారం నాటికి 18ఏళ్ల 275 రోజులు. అతి పెద్ద ప్లేయర్ నెదర్లాండ్స్ ఆటగాడు వెస్లీ. అతని వయస్సు గురువారం నాటికి 39ఏళ్ల 155 రోజులు.

2019లో మాదిరే ఈసారి కూడా టోర్నీలో పది జట్లే పోటీ పడుతున్నాయి.

పది జట్లలో ప్రతి జట్టూ మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసేసరికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి.