Robin Uthappa Retirement: మరో టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్, అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రాబిన్ ఊతప్ప, వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా చేయకుండానే ఆట నుంచి నిష్క్రమణ
తన చివరి మ్యాచ్ ను 2015లో జింబాబ్వేతో ఆడాడు. అదే టూర్‌లో జింబాబ్వేపైనే చివరి టీ20 మ్యాచ్‌లో ఇండియన్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దేశం, కర్ణాటక తరఫున ప్రాతినిథ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. రెండు దశాబ్దాల తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు.
New Delhi, SEP 14: టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa ) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు ఉతప్ప రిటైర్మెంట్ (Robin Uthappa announces retirement) ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా బుధవారం సాయంత్రం వెల్లడించాడు. 2006 ఏప్రిల్ 15న గౌహతిలో ఇంగ్లండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా రాబిన్ ఉతప్ప (Robin Uthappa) టీమిండియా (team india) తరపున అరంగ్రేటం చేశాడు. 46 వన్డేలు ఆడిన ఉతప్ప ఒక్క సెంచరీకూడా చేయలేదు. వన్డేల్లో వ్యక్తిగత స్కోర్ 86. ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన ఉతప్ప వన్డేల్లో 934 పరుగులు చేశాడు. మొదటి బాల్ నుంచి దూకుడుగా ఆడటం ఉతప్ప స్పెషాలిటీ. దీంతో ఉతప్ప క్రిజ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థులు కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ చేస్తారంటే అతిశయోక్తికాదు. దూకుడుగా బ్యాటింగ్ చేసే స్వభావం ఉండటంతో 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ఉతప్పకు చోటు దక్కింది. అయితే నిలకడలేని ఆటతీరుతో టీమిండియాలో సుస్థిర స్థానాన్ని దక్కించుకోలేక పోయాడు. ఆ వరల్డ్ కప్‌ను ఇండియా గెలుచుకోవటంతో తెలిసిందే.
టీమిండియా తరపున ఉతప్ప 13 టీ20 మ్యాచ్ లు ఆడి 249 రన్స్ చేశాడు. తన చివరి మ్యాచ్ ను 2015లో జింబాబ్వేతో ఆడాడు. అదే టూర్‌లో జింబాబ్వేపైనే చివరి టీ20 మ్యాచ్‌లో ఇండియన్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా ఉతప్ప.. దేశం, కర్ణాటక రాష్ట్రం తరఫున ప్రాతినిథ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. రెండు దశాబ్దాల తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఐపీఎల్‌లోనూ ఉతప్పకు ఘనమైన రికార్డులు ఉన్నాయి. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలుచుకున్నప్పుడు, ఉతప్ప ఆ సీజన్‌లో అత్యధిక పరుగుల (660)కు ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగోసారి చాంపియన్‌గా నిలబెట్టడంలో ఉతప్ప కీలక భూమిక పోషించాడు. ఐపీఎల్‌లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన ఉతప్ప 4,952 పరుగులు చేశాడు.