India vs Zimbabwe 5th T20I 2024: చెలరేగి ఆడిన సంజూ శాంసన్, జింబాబ్వేతో ఐదో టీ-20లో టీమిండియా ఘన విజయం, 4-1 తేడాతో సిరీస్ కైవసం
నామమాత్రమైన ఐదో టీ20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది (India Win). భారీ ఛేదనలో భారత బౌలర్ ముకేశ్ కుమార్(4/22) విజృంభణకు ఆతిథ్య జట్టు బ్యాటర్లు విలవిలలాడారు.
New Delhi, July 14: టీ- 20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా (Team India) ఆఖరి మ్యాచ్‌లోనూ పంజా విసిరింది. నామమాత్రమైన ఐదో టీ20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది (India Win). భారీ ఛేదనలో భారత బౌలర్ ముకేశ్ కుమార్(4/22) విజృంభణకు ఆతిథ్య జట్టు బ్యాటర్లు విలవిలలాడారు. డియాన్ మయర్స్(34), తడివనశె మరుమని (27)లు పోరాడినా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పించుకోలేకపోయింది. దాంతో, భారత జట్టు 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. హ్యాట్రిక్ ఓటములతో జోరుమీదున్నభారత జట్టు ఐదో టీ20లోనూ జయభేరి మోగించింది. ఆతిథ్య జట్టును ఆలౌట్ చేసి పర్యటనను విజయంతో ముగించింది.
నామమాత్రమైన ఐదో టీ20లో భారత జట్టు ఆతిథ్య జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. గత మ్యాచ్ హీరోలు యశస్వీ జైస్వాల్(12), శుభ్‌మన్ గిల్(13)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. సెంచరీ వీరుడు అభిషేక్ శర్మ(14) సైతం నిరాశపరిచగా 40 పరుగులకే 3 కీలక వికెట్లు పడ్డాయి. ఆ దశలో సంజూ శాంసన్ (58) (Sanju Samson) పట్టుదలగా ఆడాడు.
రియాన్ పరాగ్(22)తో కలిసి నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించి జట్టు స్కోర్ 100 దాటించాడు. హాఫ్ సెంచరీ కొట్టాక భారీ షాట్ ఆడబోయి శాంసన్ ఔటైనా.. చివర్లో శివం దూబే(26 నాటౌట్) బౌండరీలతో విరచుకుపడ్డాడు. గరవ వేసిన 19వ ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టాడు. ఆఖరి ఓవర్లో దూబే రనౌట్ అయ్యాక రింకూ సింగ్(11 నాటౌట్) సిక్సర్, ఫోర్ బాదడంతో టీమిండియా 167 రన్స్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్‌బని రెండు వికెట్లు పడగొట్టాడు.