T20 World Cup: టీ-20 ఫైనల్ లోకి అడుగు పెట్టిన సౌతాఫ్రికా, చారిత్రక విజయంతో ఫైనల్స్ లో అడుగు పెట్టిన సఫారీలు
అయితే.. సఫారీ బౌలర్ల ధాటికి 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (10) మినహా మిగిలిన వారు ఎవరు కూడా రెండు అంకెల స్కోరు చేయలేదు. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.
New York, June 27: గ్రూపు దశలో అద్భుతంగా ఆడడం నాకౌట్ మ్యాచుల్లో తడబడడం ఇది ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా (South Africa) జట్టు తీరు. అయితే.. టీ20 ప్రపంచకప్ 2024లో (T 20 World Cup) మాత్రం చరిత్రను తిరగరాసింది. సెమీ ఫైనల్‌లో అఫ్గానిస్తాన్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించి సగర్వంగా ఫైనల్ లో అడుగుపెట్టింది. ఏ ఫార్మాట్‌లోనైనా దక్షిణాఫ్రికా (South Africa Win) జట్టు ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. ట్రినిడాడ్ వేదికగా గురువారం ఉదయం జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి అఫ్గానిస్తాన్ (Afghanistan) మొదట బ్యాటింగ్ చేసింది. అయితే.. సఫారీ బౌలర్ల ధాటికి 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (10) మినహా మిగిలిన వారు ఎవరు కూడా రెండు అంకెల స్కోరు చేయలేదు. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.
ఓపెనర్లు గుర్బాజ్ (0), జర్దాన్ (2)లతో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన గుల్బాదిన్ నైబ్ (9) ఘోరంగా విఫలం అయ్యారు. ఆదుకుంటాడు అనుకున్న కెప్టెన్ రషీద్ ఖాన్ (8)తో పాటు నబీ (0)లు కూడా త్వరగా పెవిలియన్‌కు చేరుకోవడంతో అఫ్గాన్ తక్కువ పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, షంసీ లు చెరో మూడు వికెట్లు తీశారు. రబాడా, నోకియా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా జట్టుకు ఆరంభంలో గట్టి షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్ (5) రెండో ఓవర్‌లో ఫారుఖీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో సౌతాఫ్రికా 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(25 బంతుల్లో 29 నాటౌట్), కెప్టెన్ మార్‌క్రమ్ (21 బంతుల్లో 23 నాటౌట్) లు అఫ్గాన్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సమయోచితంగా ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బంతులను బౌండరీలకు తరలిస్తూ 8.5 ఓవర్లలోనే జట్టును విజయాన్ని అందించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్‌లో గెలిచిన జట్టుతో శనివారం ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తలపడనుంది.