SRH vs MI Match Result: ప్లే-ఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం, టోర్నీ నుంచి కేకేఆర్ ఔట్, రేపట్నించి ప్లేఆఫ్ మ్యాచ్‌లు షురూ
నవంబర్ 5, గురువారం రోజున టాప్ 2 జట్లైన ముంబై ఇండియన్స్ మరియు దిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లనుండగా, ఓడిన జట్టుకు మాత్రం మరో మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఆ తరువాతం నవంబర్ 6న, టాప్ 3-4 జట్లైన సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మరియు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడతాయి...
గెలిస్తేనే ప్లే-ఆఫ్స్‌కు బెర్త్ ఖాయం,లేకపోతే ఇంటికెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒత్తిడిని అధిగమించించి టేబుల్ టాపర్స్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ ఒక్క విజయంతో ప్లే-ఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన హైదరాబాద్, తిరుగులేని రన్ రేట్ తో బెంగళూరును కిందకు తోసి ఏకంగా మూడోస్థానానికి ఎగబాకింది. ఇక SRH ఓటమిపైనే ఆశలు పెట్టుకున్న కోల్ కతా కథ అక్కడికే ఖతం అయింది. నిరాశతో ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమించింది.
మంగళవారం జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్, వరుసగా వికెట్లు పడగొడుతూ ముంబై బ్యాట్స్ మెన్ ను కట్టడిచేసింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ 3 వికెట్లు, హోల్డర్, నదీమ్ లు చెరి 2 వికెట్లు, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టి అద్భుతంగా రాణించారు. అయియే చివర్లో పొలార్డ్ 25 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో విజృంభించి 41 పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.
అనంతరం ఛేజింగ్ ఆరంభించిన హైదరాబాద్ కసిగా, ఒక కమిట్మెంట్ తో ఆడింది. SRH ఓపెనర్లు డేవిడ్ వార్నర్ మరియు వృద్ధిమాన్ సాహా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ముంబై బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ తమ వికెట్ కాపాడుకోవడమే కాకుండా రన్ రేట్ మెరుగ్గా ఉండేలా బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 58 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ తో 85 పరుగులతో నాటౌట్ గా నిలవగా, మరో ఒపెనర్ సాహా కూడా చక్కని సహాకారం అందిస్తూ 45 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ కలిసే ముంబై నిర్ధేషించిన లక్ష్యాన్ని కేవలం 17.1 ఓవర్లలోనే 151 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో ముంబైని చిత్తుచేయటమే కాకుండా ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లింది
ఈ సీజన్ లో మొదట హైదరాబాద్ 7 మ్యాచ్ లలో ఓడిపోయి, కేవలం 4 విజయాలే నమోదు చేసి టోర్నిలో వెనకబడింది. ఆ తరువాత పుంజుకొని టేబుల్ టాప్ 3 జట్లపై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి, RCB, KKR జట్లతో సమానమైన పాయింట్లు సొంతం చేసుకుంది. అయితే కేవలం మ్యాచ్ లు గెలవటమే కాదు, రన్ రేట్ కూడా ఎక్కడా తగ్గకుండా చూసుకున్న SRH దాని ఆధారంగానే ప్లేఆఫ్ కు అర్హత సాధించింది.
ఇక రేపట్నించి ప్లేఆఫ్స్ పోరు మొదలవనుంది. నవంబర్ 5, గురువారం రోజున టాప్ 2 జట్లైన ముంబై ఇండియన్స్ మరియు దిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లనుండగా, ఓడిన జట్టుకు మాత్రం మరో మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఉంటుంది.
ఆ తరువాతం నవంబర్ 6న, టాప్ 3-4 జట్లైన సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మరియు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడతాయి. ఇది ఎలిమినేటర్ మ్యాచ్. ఇందులో ఓడిన జట్టు నేరుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుండగా, గెలిచిన జట్టు మాత్రం ఫైనల్ కు అర్హత సాధించేందుకు ఫస్ట్ ప్లేఆఫ్ మ్యాచ్ లో ఓడిన జట్టుతో ఆడాల్సి ఉంటుంది. ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ఏ జట్టు ఎగరేసుకుపోతుందో ఇక చూడాలి.