U-19 Asia Cup: అండర్ 19 ఆసియా కప్ భారత్ కైవసం, శ్రీలంక బ్యాట్స్‌మెన్ విఫలం, సత్తా చాటిన యువ టీమిండియా
డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.
దుబాయి, డిసెంబర్ 31: అండర్ 19 ఆసియా కప్ పైనల్లో భారత యువ టీమిండియా శ్రీలంక జట్టును మట్టి కరిపించి ఆసియా కప్ కైవసం చేసుకుంది. డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. మ్యాచ్ కు అడుగడుగునా వర్షం అడ్డంకిగా నిలిచింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో యువ భారత జట్టుకు అభినందనలు తెలియచేస్తున్నారు.
శ్రీలంక బ్యాట్స్‌మెన్ విఫలం
చివరి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 50 ఓవర్ల నుంచి 38 ఓవర్లకు కుదించారు. వర్షం వచ్చే సమయానికి శ్రీలంక ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లు ముగియగా, విరామం తర్వాత ఆడేందుకు కేవలం 6 ఓవర్లు మాత్రమే మిగిలాయి. అయితే భారత బౌలర్ల ముందు శ్రీలంక బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమవడంతో నిర్ణీత 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. 32వ ఓవర్‌కు శ్రీలంక 7 వికెట్లు కోల్పోయింది.
భారత్ 102 పరుగుల విజయ లక్ష్యం
భారత జట్టులో స్పిన్నర్ విక్కీ ఓస్త్వాల్, కౌశల్ తాంబే మొత్తం 5 వికెట్లు తీశారు. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం భారత జట్టు 38 ఓవర్లలో 102 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. భారత్ ఇన్నింగ్స్ కూడా పేలవంగా ప్రారంభం కావడంతో 8 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ పడింది. హర్నూర్ సింగ్ కేవలం 5 పరుగులు చేసి ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ యెసిరు రోడ్రిగోకు బలి అయ్యాడు. దీని తర్వాత ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ (56), షేక్ రషీద్ (31) 96 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ 8వ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. భారత్ 21.3 ఓవర్లలో (104/1) లక్ష్యాన్ని సాధించింది. 1989 నుండి, అండర్-19 ఆసియా కప్‌ను 9 సార్లు ఆడారు, అందులో భారత్ 8 సార్లు టైటిల్‌ను గెలుచుకుంది. 2017లో పాకిస్థాన్‌ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ ఆసియా కప్‌ను గెలుచుకుంది. 2012లో భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ టై కావడంతో ట్రోఫీని పంచుకున్నారు.