Unmukt Chand Vs Rohit Sharma: బీసీసీఐతో తెగతెంపులు, వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా తరపున బరిలోకి దిగుతున్న ఉన్ముక్త్ చంద్, జూన్ 12వ తేదీన యుఎస్ఎతో భారత్ ఢీ
తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన ఈ యువకెరటం టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉండబోతుందని అన్నాడు.
2012 అండర్ -19 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించి భారత్ కు ప్రపంచకప్ అందించిన భారత అండర్ -19 జట్టు మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అమెరికా తరపున బరిలోకి దిగుతున్నాడు. తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన ఈ యువకెరటం టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉండబోతుందని అన్నాడు.
భారత క్రికెట్ నుంచి వైదొలిగాక.. భారత జట్టుకు ప్రత్యర్థిగా ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపాడు. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. జూన్ 12వ తేదీన న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ స్టేడియంలో టీమిండియాతో అమెరికా జట్టు తలపడనుంది.అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచ కప్ పోటీలకు మరో నాలుగు నెలలు మాత్రమే ఉంది.
2012 అండర్ -19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఉన్ముక్త్ సెంచరీతో కదం తొక్కాడంతో భారత జట్టు చాంపియన్‌గా అవతరించింది. అయితే జాతీయ జట్టులోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. 2021 సెప్టెంబర్‌లో బీసీసీఐ(BCCI)తో తెగ తెంపులు చేసుకున్న ఈ యువకెరటం భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికి అమెరికా వెళ్లిపోయాడు.