Virat Kohli Creates Record: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో కొత్త రికార్డ్, చేసింది 12 పరుగులే అయినా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన కింగ్ కోహ్లీ, టీ-20 వరల్డ్ కప్‌లో వెయ్యి పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు
కోహ్లి (1001) కి ముందు శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్దనే (Jayawardene ) (1016) ఒక్కడే ఉన్నాడు. జయవర్దనే 31 ఇన్నింగ్స్ లు ఆడగా.. కోహ్లీ 24 ఇన్నింగ్స్ లలోనే ఈ మైలురాయి చేరుకున్నాడు
Perth, OCT 30: టీమిండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ (Virat kohli) మరో రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ లో (T20 World Cup) భాగంగా నేడు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 12 రన్స్ చేయడం ద్వారా విరాట్ ఈ ఘనత అందుకున్నాడు. కోహ్లి (1001) కి ముందు శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్దనే (Jayawardene ) (1016) ఒక్కడే ఉన్నాడు. జయవర్దనే 31 ఇన్నింగ్స్ లు ఆడగా.. కోహ్లీ 24 ఇన్నింగ్స్ లలోనే ఈ మైలురాయి చేరుకున్నాడు. విరాట్ (Virat Kohli) మరో 16 రన్స్ చేసుంటే జయవర్దనే రికార్డ్ బద్దలయ్యేది. కాగా, ఈ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు (T20 World Cup) తొలి ఓటమి ఎదురైంది.
పెర్త్ లో దక్షిణాఫ్రికాతో (IND vs SA) జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది. 134 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 19.4 ఓవర్లలో ఛేదించారు. టీమిండియా అంటే విశ్వరూపం ప్రదర్శించే డేవిడ్ మిల్లర్ మరోసారి విజృంభించాడు. మిల్లర్ 46 బంతుల్లో 59 పరుగులు చేసి దక్షిణాఫ్రికా (South Africa) విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయిడెన్ మార్ క్రమ్ 52 పరుగులు చేశాడు. సాధించింది స్వల్ప స్కోరే అయినా, దాన్ని కాపాడుకునేందుకు టీమిండియా బౌలర్లు శక్తిమేరకు శ్రమించారు.
అయితే, మిల్లర్ చివర్లో అశ్విన్ బౌలింగ్ లో కొట్టిన రెండు సిక్సులు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతులు ఎంతో జాగ్రత్తగా విసిరిన భువనేశ్వర్ కుమార్.. నాలుగో బంతిని షార్ట్ బాల్ గా వేసి బౌండరీ సమర్పించుకున్నాడు. దాంతో సౌతాఫ్రికా గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది.