Ronaldo to Leave Manchester United: ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డోకు ఎదురుదెబ్బ, క్లబ్ నుంచి తొలగిస్తూ మాంచెస్టర్ యునైటెడ్ ప్రకటన, రెండేళ్ల కాంట్రాక్టును మధ్యలోనే బ్రేక్ చేస్తూ నిర్ణయం, టీవీ షో లో రొనాల్డో చేసిన కామెంట్లే కారణం
ఆయన్ను వెంటనే క్లబ్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రముఖ ప్రీమియర్ లీగ్ జెయింట్ మాంచెస్టర్ యునైటెడ్ (Manchester United) ప్రకటించింది.
Qatar, NOV 23: ఒకవైపు ఫిఫా (FIFA) జోరు కొనసాగుతుండగానే...మరోవైపు పుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) గురించి సంచలన వార్త బయటకు వచ్చింది. ఆయన్ను వెంటనే క్లబ్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రముఖ ప్రీమియర్ లీగ్ జెయింట్ మాంచెస్టర్ యునైటెడ్ (Manchester United) ప్రకటించింది. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం జరిగినట్లు ప్రకటించింది. అయితే ఫిఫా కోలాహలం కొనసాగుతున్న సమయంలోనే ఈ నిర్ణయం వెలువడటంతో రొనాల్డో అభిమానులు షాక్ కు గురయ్యారు. రొనాల్డోను సడెన్‌గా తొలగించడానికి బలమైన కారణం ఉంది. గత వారం టాక్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన రొనాల్డో.. హోస్ట్ పియర్స్ మోర్గాన్‌తో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. తనకు క్లబ్ (Club) ద్రోహం చేసిందని, కొత్త మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్ (Erik ten Hag) పట్ల తనకు ఏమాత్రం గౌరవం లేదని రొనాల్డో (Ronaldo) తెలిపాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మాంచెస్టర్ యునైటెడ్ ఈ పోర్చుగల్ ఆటగాడిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే "పరస్పర అంగీకారం ప్రకారం క్రిస్టియానో రొనాల్డొ.. వెంటనే మాంచెస్టర్ యునైటెడ్‌ను వదిలేస్తున్నారు" అని మాంచెస్టర్ యునైటెడ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో రొనాల్డో ఇచ్చిన రెండు స్పెల్స్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పింది. రొనాల్డో ఈ క్లబ్ తరపున 346 గేమ్స్ ఆడగా.. 145 గోల్స్ చేశాడు. "మాంచెస్టర్ యునైటెడ్‌లోని మిగతా జట్టు సభ్యులంతా ఫోకస్ పెట్టి ఆడుతూ.. ఎరిక్ టెన్ హాగ్ నేతృత్వంలో ముందుకు సాగాలి. అందరూ కలిసి విజయాలు సాధించాలి" అని తన ప్రకటనలో తెలిపింది క్లబ్.
మరోవైపు దీనిపై రొనాల్డో స్పందించాడు. "మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిపిన చర్చల ప్రకారం.. మా కాంట్రాక్ట్‌ను ముందుగానే ముగించుకోవాలని పరస్పరం అంగీకరించుకున్నాం" అంటూ ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. "నాకు మాంచెస్టర్ యునైటెడ్ అంటే ప్రేమ. నాకు ఫ్యాన్స్ అంటే ప్రేమ. అవి ఎప్పటికీ మారవు. ఐతే.. కొత్త సవాలును స్వీకరించేందుకు ఇది నాకు సరైన సమయం అని భావిస్తున్నాను. ఈ సీజన్‌తోపాటూ భవిష్యత్తులో కూడా టీమ్ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను" అని తెలిపాడు.
ఓల్డ్ ట్రాఫోర్డ్ విధానాలు, టెన్ హాగ్‌పై టీవీ ఇంటర్వ్యూలో విమర్శలు చేసిన 37 ఏళ్ల రొనాల్డో.. ప్రస్తుతం ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ స్క్వాడ్‌తో ఉన్నాడు. అతను క్లబ్ అమెరికా ఓనర్లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ఆట కంటే.. డబ్బుపైనే క్లబ్ ఫోకస్ పెడుతోందని విమర్శించాడు. దీంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే మాంచెస్టర్ యునైటెడ్ నిర్ణయం తర్వాత రొనాల్డో ఏ స్టెప్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.