Luis Suarez Passes Away: స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం సూరెజ్ మిరమొంటెస్ కన్నుమూత, ఆ అవార్డు సాధించిన ఏకైక స్పెయిన్ క్రీడాకారుడు అతనే
‘గోల్డెన్ గలిసియన్'(Golden Galician)గా పేరొందిన అతను 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు.
Spain, July 09: స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం లూయిస్ సూరెజ్ మిరమొంటెస్(Luis Suárez Miramontes) కన్నుమూశాడు. ‘గోల్డెన్ గలిసియన్'(Golden Galician)గా పేరొందిన అతను 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు. లూయిస్ మరణ వార్తను అతను గతంలో కోచ్‌గా పనిచేసిన ఇంటర్ మిలన్(Inter Milan) క్లబ్ వెల్లడించింది. అయితే.. అతడు చనిపోవడానికి కారణం ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. మిడ్‌ఫీల్డర్‌గా ఓ వెలుగు వెలిగిన అతను సాకర్‌లో ప్రతిష్ఠాత్మకమైన బాలన్ డి ఓర్ అవార్డు(Ballon d’Or Award)ను 1960లో అందుకున్నాడు. ఈ అవార్డు గెలిచిన ఏకైక స్పెయిన్ ఆటగాడిగా లూయిస్ గుర్తింపు సాధించాడు. లూయిస్ పుట్టి పెరిగిందంతా స్పెయిన్‌లోని గలిసియాలో. కానీ, అతను ఇటలీ జట్టుకు ఎన్నో ట్రోఫీలు అందించాడు. వాటిలో.. 1964 యూరోపియన్ కప్(European Cup), 1965 ఇటాలియన్ లీగ్ టైటిల్స్(Italian League Titles) ముఖ్యమైనవి. రెండు సార్లు స్పానిష్ లీగ్ టైటిల్స్ గెలిచాక లూయిస్ బార్సిలోనా(Barcelona) క్లబ్‌కు మారాడు.
1973లో ఆటకు వీడ్కోలు పలికిన లూయిస్ మూడు పర్యాయాలు ఇంటర్ మిలన్ జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. ఆ తర్వాత బార్సిలోనా క్లబ్ కోచ్‌గా పనిచేశాడు. ‘లూయిస్ మరణించడం చాలా బాధాకరం. అతనొక అద్భుతమైన ఫుట్‌బాలర్. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం’ అని బార్సిలోనా ఒక ప్రకటనలో తెలిపింది. 253 మ్యాచ్‌లు ఆడిన లూయిస్ 141 గోల్స్ కొట్టాడు.