Tokyo 2020: బంగారు పతకంతో నీరజ్‌పై రూ.కోట్ల వర్షం, టోక్యోలో పతకం సాధించిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానా, 13 ఏళ్ల తరువాత ఒలంపిక్స్‌లో జాతీయ గీతం ఆలాపన, ఈ ఏడాది 7కు చేరిన భారత్ పతకాల సంఖ్య
విశ్వక్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ పతక ప్రదర్శన కావడం విశేషం. అంతకుముందు ఉత్తమంగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించింది.
టోక్యో ఒలింపిక్స్ వేడులు నేటితో ముగియనున్నాయి. ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లో ( Tokyo Olympics 2020) భారత్ మొత్తంగా ఓ పసిడి, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో ఏడింటిని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో భారత పోటీలకు ఆఖరిరోజైన శనివారం బజ్‌రంగ్ కంచు ‘పట్టు’కు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణ సంబరం తోడడంతో పతకాల సంఖ్యలో లండన్ ను భారత్ (India At Tokyo Olympics 2020) దాటేసింది. విశ్వక్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ పతక ప్రదర్శన కావడం విశేషం. అంతకుముందు ఉత్తమంగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించింది.
13 ఏళ్ల తరువాత విశ్వక్రీడల వేదికపై భారత జాతీయ గీతం ఆలాపన జరిగింది. ఎప్పుడో 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అభినవ్ బింద్రా బంగారు పతకం నెగ్గిన సమయంలో ఒలింపిక్స్ వేదికపై వినపడిన భారత జాతీయ గీతం ఇన్నేళ్ల తరువాత మళ్లీ వినపడింది. 130 కోట్ల మంది భారతీయుల హృదయం ఆనందంతో ఉప్పొంగేలా చేసింది. నీరజ్ చోప్రాకు బంగారు పతకం అందించిన సమయంలో జాతీయ గీతం ఆలాపన జరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇక ఒలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గి 121 ఏళ్ల భాతర అథ్లెటిక్ చరిత్రలో నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. దేశ ప్రజలంతా నీరజ్‌ను ప్రశంసల వర్షంలో ముంచేస్తున్నారు. అతనిపై కోట్ల వర్షాన్ని కురిపించారు. హరియాణా ప్రభుత్వం రూ.6 కోట్ల నగదు, సగం ధరకు ఇంటి స్థలం, క్లాస్-1 ఉద్యోగం, పంచకులలో నిర్మించనున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ చీఫ్‌గా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. పంజాబ్ ప్రభుత్వం రూ. 2 కోట్లు నజరానా ప్రకటించింది. నీరజ్ పనిచేస్తున్న ఆర్మీ రూ. 2 కోట్ల రూపాలయను బహుమతిగా అందించింది.
ఇక మణిపూర్ ప్రభుత్వం రూ. కోటి నజరానాను ప్రకటించింది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని ఓ ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కూడా నీరజ్‌కు తమ జట్టులో ప్రత్యేక స్థానం కల్పించింది. నీరజ్‌కు సీఎస్‌కే ఫ్రాంచైజీ రూ.కోటి అవార్డ్ ప్రకటించింది. అలాగే అతడి పేరున తమ జట్టు జెర్సీని కూడా ప్రకటించింది. ఆ జెర్సీపై 8758 నెంబరును ముద్రించనుంది. బీసీసీఐ రూ. కోటి నజరానాను ప్రకటించింది.
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తన వంతుగా నీరజ్ చోప్రాకు ఓ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. అతడిని బాహుబలి అంటూ అభినందించారు. బాహుబలి సినిమాలో బల్లెం పట్టుకుని గుర్రంపై ఉన్న ప్రభాస్ ఫోటోను, ఒలింపిక్స్‌లో జావెలిన్ విసురుతున్న నీరజ్ చోప్రా ఫోటోను పక్క పక్కనే పెట్టి ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు ‘మేమంతా నీ సైన్యంలో ఉన్నాం’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో పాటు నీరజ్‌కు తన వంతుగా మహీంద్ర కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న ఎస్‌యూవీ శ్రేణికి చెందిన ఎక్స్‌యూవీ 700(XUV 700)ని ఇస్తున్నట్లు ప్రకటించాడు.
రితేష్ అనే ట్విటర్ యూజర్ ముందుగా ఆనంద్ మహీంద్రాను ఈ అభ్యర్థన చేశాడు. దీనికి అంగీకరిస్తూ అతడి ట్వీట్‌కు ఆనంద్ మహీంద్ర రిప్లై ఇచ్చారు. ‘‘తప్పకుండా ఇస్తాను. స్వర్ణం సాధించిన మా అథ్లెట్‌కు ఎక్స్‌యూవీ 700 (XUV 700)బహుమతిగా ఇవ్వడం నాకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకం మాత్రమే కాక.. గౌరవం కూడా’’ అంటూ రిప్లై ఇచ్చారు.
ఇక హరియాణా ప్రభుత్వం ఒలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్లేయర్‌కు పతకంతో సంబంధం లేకుండా రూ. 10 లక్షలు అందించనుంది. అలాగే కాంస్యం గెలిచిన బజ్‌రంగ్ పూనియాకు రూ. 2.5 కోట్లు, ప్రభుత్వోద్యోగం, ఇంటి స్థలం ఇస్తారు. బజ్‌రంగ్ స్వస్థలంలో ఓ ఇండోర్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తారు. బీసీసీఐ... రజతాలు సాధించిన రవి దహియా, మీరాబాయ్ చానులకు చెరో రూ. 50 లక్షలు, కాంస్యాలు సాధించిన సింధు, లవ్లీనా, బజ్‌రంగ్‌లకు తలో రూ. 25 లక్షలు, పురుషుల హాకీ జట్టుకు రూ.1.25 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్‌కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి ప్రశంసించారు. పంద్రాగస్టు వేడుకల్లో తనని కలుస్తానని మోదీ ప్రధాని తెలిపారు. ఇంకా పలువురు ప్రమఖులు నీరజ్ కు అభినందంనలు తెలిపారు.
నీరజ్ చోప్రాది అపూర్వ విజయం అతడి గెలుపు దేశ యువతలో స్ఫూర్తి నింపుతుంది. కాంస్యం నెగ్గిన బజ్‌రంగ్ పూనియాకు అభినందనలు. అదితి ప్రదర్శనతో భారత్ గోల్ఫ్ నూతన శిఖరాలకు చేరుకుంది. - రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్
నీరజ్ చరిత్ర సృష్టించి భారత్ కీర్తిని ఇనుమడింప చేశాడు. అసాధారణ విజయంతో భారతీయుల హృదయాలను ఆనందంతో నింపేశాడు. అద్భుతంగా ఆడిన బజ్‌రంగ్ తన విజయంతో దేశాన్ని గర్వించేలా చేశాడు. - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నీరజ్ ఘనత చిరకాలం గుర్తుంటుంది. స్వర్ణ పతకం గెలిచినందుకు అతణ్ణి అభినందిస్తున్నా. బజ్‌రంగ్ పూనియా అద్భుతంగా పోరాడాడు. గోల్ఫ్‌లో అదితి త్రుటిలో పతకం కోల్పోయినా అసామాన్య పోరాట పటిమను చూపింది. - ప్రధాని నరేంద్ర మోదీ
నీరజ్ ఇండియన్ గోల్డెన్ బాయ్. భారత ఒలింపిక్స్ చరిత్రను అతడు తిరగరాశాడు. చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి.- కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్
వందేళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశాడు. నీరజ్ పతకం దేశంలోని క్రీడాకారులందరికి స్ఫూర్తిగా నిలుస్తుంది. - సీఎం కేసీఆర్
భారత సైన్యంలో పనిచేస్తున్న సైనికుడు, అథ్లెటిక్స్‌లో దేశం యొక్క మొట్టమొదటి #ఒలింపిక్ స్వర్ణం గెలుచుకోవడం ద్వారా భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు.-సీఎం వైయస్ జగన్
పతకాలు సాధించిన భారత ఆటగాళ్ల వివరాలు
1. నీరజ్ చోప్రా : జావెలిన్ త్రోలో బంగారు పతకం
2. రవికుమార్ దహియా : వ్రెస్ట్లింగ్ లో సిల్వర్
3. మీరాబాయి చాను : వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్
4. పీవీసింధు : బ్యాట్మింటన్ లో కాంస్యం మెడల్
5. లవ్లీనా : బాక్సింగ్ లో కాంస్యం
6. బజరంగ్ పూనియా : వ్రెస్ట్లింగ్ లో కాంస్యం
7. ఇంటియన్ హాకీ టీమ్ : హాకీలో కాంస్యం