Andhra Pradesh: కుప్పం నుంచే ఆరంభం, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు మనవే, కుప్పం నియోజక వర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం జగన్
2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లో వైసీపీ (YCP) విజయం సాధించే దిశగా అడుగులు వేసుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు
Kuppam, August 5: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లో వైసీపీ (YCP) విజయం సాధించే దిశగా అడుగులు వేసుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ (CM Jagan)అయ్యారు.
ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేశారు. కుప్పం (Kuppam) నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా భావిస్తానని, కార్యకర్తలకు కష్టసుఖాల్లో తోడు, నీడగా ఉంటానని సీఎం (CM YS Jagan Mohan Reddy)భరోసా ఇచ్చారు.ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఆ నియోజకవర్గంలో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తించి, ఆశీర్వదించడమే ఈ విజయానికి కారణం అని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన దాని కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని, ఇంటింటా మనం చేసిన మంచి కన్పిస్తోందన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రతి కార్యకర్త కాలరెగరేసుకుని ఇంటింటికీ వెళ్లి.. ‘అక్కా.. మీకు ఈ మంచి చేశామా? లేదా?’ అని అడిగే స్థాయిలో.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో మంచి చేశామని చెప్పారు. ప్రజల ఆశీస్సులను ఓట్ల రూపంలోకి మార్చే బృహత్తర బాధ్యత మీదేనని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ‘మూడేళ్లుగా భరత్ చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. భరత్‌కు ఒక్కసారి తోడుగా నిలబడి గెలిపించుకుని రండి.. మంత్రిని చేస్తాను.. కుప్పం అభివృద్ధికి మరింతగా ఉపయోగపడతాడు’ అని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.
175కు 175 అసెంబ్లీ సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నియోజకవర్గం నుంచే మొదలు కావాలని సీఎం సూచించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. పార్టీ క్యాడర్‌ను ఉత్తేజ పరిచారని, భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే దానిపై దిశా నిర్దేశం చేశారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఇంట్లోనూ వివరించాలని సూచించారని తెలిపారు.
కార్యకర్తలందరితో ఆప్యాయంగా మాట్లాడారని, అన్ని వేళలా నియోజకవర్గానికి తను అండగా ఉంటానని భరోసా ఇచ్చారని చెప్పారు. టీడీపీ తరహాలో కక్ష సాధింపు రాజకీయాలు వద్దేవద్దని స్పష్టం చేశారని వివరించారు. వైఎస్సార్‌సీపీకి మైలేజ్ వస్తుందని హంద్రీ–నీవా కాలువ (కుప్పం బ్రాంచ్ కెనాల్)ను సీఎం రమేష్ మూడేళ్లుగా పూర్తి చేయడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వేరే వారికి కాంట్రాక్టు ఇచ్చి ఏడాదిలో పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు.