Andhra Pradesh: ఆర్బీకే వ్యవస్థను బలోపేతం చేయండి, పశువులకు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టండి, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల్లో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు.
Amaravati, Jan 25: తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల్లో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు.ఈ సమీక్షా సమావేశంలో మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ,పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ (ఎఫ్‌ఏసీ) వై మధుసూధన్‌రెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు తదితరులు హాజరయ్యారు.
సమీక్ష సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..
వైద్య, ఆరోగ్య శాఖలో మండలానికి రెండు పీహెచ్‌సీలు, అలాగే ప్రతి సచివాలయానికి ఒక విలేజీ క్లినిక్స్ ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నాం.
అలాగే పశు సంవర్థక శాఖలో కూడా ఈ తరహాలోనే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలి.
యూనిఫార్మిటీ (ఏకరూపత) తీసుకురావడం ద్వారా మంచిసేవలు అందుబాటులో తీసుకురావొచ్చు.
ఈ విధానాన్ని నిర్దేశించుకున్న తర్వాత నాడు–నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలి.
దీనికి సంబంధించి ఒక హేతుబద్ధత ఉండాలి.
దీనికోసం ఒక మార్గదర్శక ప్రణాళికను తయారుచేయాలి.
పశువులకు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలి. లక్ష్యాలు నిర్దేశించుకుని.. ఆ మేరకు వ్యాక్సిన్లు వేయాలి.
మూగ జీవాలకు మెరుగైన వైద్యం, 165 వైఎస్సార్ వెటర్నరీ అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్
ప్రజారోగ్యానికి సంబంధించి గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్, అందులో ఏఎన్‌ఎం, అండగా ఆశావర్కర్లు ఇలా ఒక వ్యవస్థ జనరేట్ అయ్యింది.
అలాగే ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలి.
యానిమల్ హస్బెండరీ అసిస్టెంటు సమర్ధతను పెంచాలి.
గ్రామస్థాయిలో ఒకరిద్దరు వాలంటీర్లను ఈ సేవల్లో నిమగ్నం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. దీనికోసం ఎస్‌ఓపీ తయారుచేయాలన్నారు.
ప్రతీ మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్ధ నుంచి ఆర్బీకేల్లో ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంటుకు పూర్తిస్థాయి మద్దతు, సహకారం ఉండాలి.
దీనివల్ల సంతృప్తస్థాయిలో పశువులకు తగిన వైద్యం సహా పోషణ సేవలను అందించడానికి వీలవుతుంది.
పశుపోషణ చేస్తున్న వారి వద్ద కాల్‌సెంటర్ నంబర్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ నంబర్లు అందుబాటులో ఉండాలి.
ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకూ హెల్త్ కార్డు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలి.
దీనివల్ల వాటికి అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుందని సీఎం జగన్ తెలిపారు.
పశుసంవర్థక శాఖలో ఏ స్కీం అమలు చేసినా అర్హులందరికీ అది అందాలి.
ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే.. అందరికీ ఆ స్కీంలు అందజేయాలి.
వివక్ష లేకుండా అందరికీ స్కీంలు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏర్పాటు చేసిన మిల్క్ సొసైటీల వద్ద అమూల్ భాగస్వామ్యంతో పాడిరైతులకు శిక్షణ ఇప్పించాలి.
పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. పాల నాణ్యత పెరగాలి.
రసాయనాలకు తావులేని పశుపోషణ విధానలపై అవగాహన పెంచాలి.
పశుసంవర్థక శాఖలో అన్ని రకాల సేవల కోసం ఒకే నంబరు వినియోగించాలి.
పశువుల అంబులెన్సులు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి.
దీనికోసం ఎస్‌ఓపీ రూపొందించాలి.
పశువులకు సేవల్లో దేశానికి మార్గనిర్దేశంగా నిలిచామని, దాన్ని కొనసాగించాలన్న సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఏపీలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్ విధానంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రానికి పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కేరళకు చెందిన అధికారులు వచ్చి సందర్శించి వెళ్లినట్టు అధికారులు తెలిపారు.
వైఎస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పించాలని సీఎం జగన్ తెలిపారు.
ఇప్పటికే రెండు సంవత్సరాలపాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అక్క చెల్లెమ్మలకు ఏడాదికి రూ.18,750 చొప్పున ఇచ్చాము.
ఈ డబ్బు వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరచడానికి, ఆ మార్గాలను బలోపేతంచేయడానికి ఉపయోగపడుతుందన్నారు.
పశుపోషణ సహా ఇతర జీవనోపాధి మార్గాలకోసం అవసరమైన రుణాలు మంజూరు చేయించడంలో కూడా అధికారులు దృష్టిపెట్టాలన్నారు.
పశువులకు పంపిణీ చేసిన మందులను నిల్వచేయడానికి ప్రతీ ఆర్బీకేలో ఫ్రిజ్ సహా అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఇక, సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 4,765 ఏహెచ్‌ఏ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.
జగనన్న పాలవెల్లువ సీఎం వైఎస్ జగన్ సమీక్ష..
2.6 లక్షల మంది రైతులు పాలవెల్లువ కింద పాలు పోస్తున్నారన్న సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు.
606 లక్షల లీటర్లను ఇప్పటివరకూ సేకరించాము.
వచ్చే రెండు నెలల్లో మరో 1422 గ్రామాల్లోకి జగనన్న పాలవెల్లువ కార్యక్రమం వెళ్తుంది.
చిత్తూరు డైయిరీ పునరుద్ధరణకు వేగంగా పనులు జరుగుతున్నాయి.
దీంతో, మరో రెండు మూడు వారాల్లో శంకుస్థాపనకు అన్నీ సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపైనా సమీక్ష..
మొదటి విడతలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులపైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ క్రమంలో వేగంగా పనులు సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. జువ్వలదిన్నెలో ఇప్పటికే 92.5శాతం పనులు పూర్తి అయినట్టు తెలిపారు. ఫిబ్రవరి 15 నాటికి జువ్వలదిన్నె పనులు పూర్తి అవుతాయన్నారు. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో కూడా పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రతీ త్రైమాసికానికి ఒకటి చొప్పున డిసెంబర్ నాటికి మొదటి ఫేజ్ ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు.. సీఎం జగన్‌కు తెలిపారు.
రెండో ఫేజ్‌లో నిర్మించనున్న వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ సహా అన్నిరకాలుగా అనుమతులు మంజూరు అయ్యాయని అధికారులు వెల్లడించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
ఇక, మొత్తం 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 3,520.57 కోట్లు ఖర్చు చేస్తున్నది.
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వల్ల జీడీపీ పెరుగుతుంది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి పెరుగుతుంది. దీని వల్ల ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్ తెలిపారు.
ప్రతి ఫిషింగ్ హార్భర్ నుంచి ఏడాదికి వేయి కోట్ల రూపాయలకుపైగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయని సీఎం జగన్ అన్నారు.
ఇది పరోక్షంగా ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
ఉపాధి కోసం మన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్న సీఎం జగన్ ఆకాంక్షించారు.
ఆక్వా రైతులకు మేలు జరగాలి.
దీనికోసం ఫీడు, సీడు రేట్లపై నియంత్రణ కోసం చట్టాలను తీసుకువచ్చామన్నారు.
వీటిని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు.
ఆక్వా రంగంలో కూడా మధ్యవర్తుల ప్రమేయాన్ని తీసివేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు.
దీని ద్వారా ఆర్బీకే వ్యవస్థను బలోపేతం చేయాలని, ఈ సీజన్లో అధికారులు దీన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.
దీనిపై అధికారులు యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకోవాలన్నారు.
ఆక్వాలో కొత్త ప్రాసెసింగ్ సెంటర్లపైనా దృష్టిపెట్టాలన్నారు.
సహకార రంగం మాదిరిగా ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటుపై తగిన ఆలోచన చేయాలన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)