Andhra Pradesh Elections 2024: రేపటి నుండి మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్న సీఎం జగన్, ఇచ్ఛాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర
2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సుయాత్రతో ప్రచార భేరి మోగించనున్నారు.
YSRCP Memantha Siddam Bus Yatra: 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సుయాత్రతో ప్రచార భేరి మోగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది.
పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర (YSRCP Memantha Siddam Bus Yatra) కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు.తొలి విడతలో బస్సు యాత్ర (Memantha Siddam Bus Yatra ), ఆతర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు, మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధ, అధికారికంగా ప్రకటించిన వైసీపీ
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది.వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర తొలి రోజు కడప పార్లమెంట్ పరిధిలో కొనసాగనుంది. ఇడుపులపాయలో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సీఎం జగన్ ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. ఎర్రగుంట్ల రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద సీఎం జగన్ విడిది చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Here's YSRCP Tweet
సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకన్యకాపరమేశ్వరి సర్కిల్, సినీ హబ్, ఆర్టీసీ బస్టాండ్, శివాలయం వీధి, రాజీవ్ సర్కిల్, కొర్రపాడు రోడ్డు మీదుగా బస్సు యాత్ర జరగనుంది. ఐదు గంటలకు పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. ఇందు కోసం సభ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులను ‘మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం.. ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం’ పేరుతో గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టంగా ఎన్నికలకు సన్నద్ధం చేసేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో, ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మలి విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు.