Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికలు, లోక్ సభకు రూ.25,000, అసెంబ్లీకి రూ. 10,000, సీటు ఆశించే వారి నుంచి 'విరాళం'గా వసూలు చేస్తున్న కాంగ్రెస్

మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ యూనిట్‌ బుధవారం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.

Congress (File Image)

అమరావతి, జనవరి 24: ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ యూనిట్‌ బుధవారం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. ఏపీ ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ తరహాలో ఆంధ్రప్రదేశ్ యూనిట్ కూడా లోక్ సభ సీటుకు రూ. 25 వేలు, అలాగే అసెంబ్లీ సీటుకు రూ. 10 వేలు విరాళంగా వసూలు చేస్తోంది.

మరో రెండు వారాల పాటు దరఖాస్తులు స్వీకరిస్తామని ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌ తెలిపారు. అన్ని దరఖాస్తులను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ద్వారా ప్రాసెస్ చేస్తామని, తర్వాత అది AICC స్క్రీనింగ్ కమిటీ ద్వారా వెళ్తుందని ఠాగూర్ చెప్పారు. ఆ తర్వాత జాబితాను అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనున్నారు. "ఇది (కాంగ్రెస్) ప్రజాస్వామ్య పార్టీ. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్త ఎవరైనా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు" అని ఠాగూర్ అన్నారు.

నేటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకు దరఖాస్తుల స్వీకరణ, కాంగ్రెస్ మాజీలకే పెద్దపీట వేసే అవకాశం

మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్ సమర్పించగా.. రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ ఇచ్చారు. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్తకు అప్లికేషన్‌ సమర్పించే అవకాశం ఉందని మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్ధులను నిర్ణయిస్తుంది.

ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది. మాజీలంతా నిజమైన కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పోటీ చేసే స్ధానంపై త్వరలోనే స్పష్టత వస్తుందని అని అన్నారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసేందుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ అయిన 'డొనేట్ ఫర్ దేశ్' ద్వారా విరాళాలు అందించవచ్చని ఆయన అన్నారు.