Andhra Pradesh Elections 2024: ఆసక్తికరంగా మారిన కందుకూరు రాజకీయాలు, వైసీపీలో చేరిన డాక్టర్ వంకి పెంచలయ్య, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దారెటు..
ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డా.పెంచలయ్యకు సీఎం జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.
Nellore, Feb 8: ఏపీ సీఎం జగన్ సమక్షంలో కందుకూరుకు చెందిన డా.వి.పెంచలయ్య (Doctr Penchalaiah) బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డా.పెంచలయ్యకు సీఎం జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. డా.పెంచలయ్యతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు వి.అరవింద, డాక్టర్ వి.ఐశ్వర్య కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి (Manugunta Mahidhar Reddy) పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని అధిష్ఠానానికి చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, కందుకూరు అభ్యర్థిగా నెల్లూరు ఆదిశంకర విద్యాసంస్థల అధినేత వంకి పెంచలయ్యకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కందుకూరు గతంలో ప్రకాశం జిల్లాలో ఉండేది. ఒకప్పుడు కందుకూరు కాంగ్రెస్ కు కంచుకోటగా కొనసాగింది. 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా మానుగుంట మహీధర్ రెడ్డి కందుకూరు నుంచి గెలిచారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు.
2014లో మహీధర్ రెడ్డి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన పోతుల రామారావు కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, పోతుల రామారావు రెండేళ్ల అనంతరం టీడీపీలో చేరారు. 2018లో వైసీపీలో చేరిన మహీధర్ రెడ్డి 2019లో పోతుల రామారావును ఓడించారు.
ఇప్పుడు పోటీ నుంచి విరమించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వైసీపీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే మహీధర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరాదన్న నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని మహీధర్ రెడ్డి సీఎం జగన్ ను కోరగా, అందుకు సీఎం అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది.